ఇద్దరు కవలలు మరో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకోవడం.. వినటానికే ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించే వార్త ఇది. ఎంతో మందిని ఆకర్శించిన ఈ కవల జంటలు ఇటీవలే ట్విన్స్ డే రోజు పెళ్లి చేసుకున్నారు. అంతలోనే కవలల్లో ఒక వరుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న వరుడు.. సూసైడ్ చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన నవ వరుడు దుంపటి వినయ్ కుమార్ (31) ఆత్మహత్య చేసుకున్నాడు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద గల మానేరులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 22న ట్వీన్స్ డే రోజు వినయ్ కి కీర్తనతో వివాహం జరిగింది. ట్విన్స్ డే రోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల వివాహం ఎంతో మందిని ఆకర్శించింది. అరుదైన వివాహంగా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ అంతలోనే ఒక వరుడు చనిపోవడం విషాదంగా నిలిచింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ కు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతుడు హైదరాబాదులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వినయ్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి . కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
