
ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన రంగాల్లో ఉపాధి కల్పిస్తం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన రంగాల్లో సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి.. వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అసెంబ్లీలో శనివారం ఎలక్ట్రానిక్ రంగ పరిశ్రమలపై ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబిచ్చారు. గత ఆరేళ్లలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో కొత్తగా 1,60,000 జాబ్స్ సృష్టించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ రంగంలో కేవలం 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని చెప్పారు. గడిచిన ఏడాదిలోనే కొత్తగా 40 కంపెనీలు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.2కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నామని, ఐటీ రంగంలో 16 పాలసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 60 వేల మంది లోకల్ యువతకు ఎలక్ట్రానిక్ సిస్టం డిజైనింగ్ మాన్యుఫాక్చరింగ్(ఈఎస్డీఎం) ట్రైనింగ్ ఇచ్చామని, వారిలో 30 వేల మందికి ఇదే రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు.