కరెంట్​ బిల్లులు మంత్రి వెంకట్​రెడ్డికే పంపాలి : కేటీఆర్​

కరెంట్​ బిల్లులు మంత్రి వెంకట్​రెడ్డికే పంపాలి : కేటీఆర్​
  •     రాష్ట్రాన్ని కేంద్రం చేతిలో పెడుతున్నరు: కేటీఆర్​
  •     ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్​ అడ్డగోలు మాటలు చెప్పిండు
  •     ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా మేం మాట్లాడుడు మొదలుపెట్టలేదు
  •     కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో
  •     ముగిసిన సన్నాహక సమావేశాలు

హైదరాబాద్, వెలుగు : కరెంట్​బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నవంబర్​నెలలోనే అన్నారని, అదే విషయం తాను గుర్తు చేశానని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. నల్గొండ ప్రజలు తమ కరెంట్​బిల్లులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి పంపించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరెంట్​కోతలు మొదలయ్యాయని.. రానున్న రోజుల్లో మరిన్ని కోతలు తప్పవని అన్నారు. నాగార్జునసాగర్​ ఎడమ కాలువ ఆయకట్టుకు క్రాప్​హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు చివరి ఆయకట్టును ఎండ బెడుతున్నారని విమర్శించారు.

 ‘‘శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించి రాష్ట్రాన్ని కాంగ్రెస్​ప్రభుత్వం కేంద్రం చేతిలో పెడుతున్నది” అని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన నల్గొండ లోక్​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. ఈ నెల 3న ఆదిలాబాద్​లోక్​సభ నియోజకవర్గంతో మొదలైన బీఆర్​ఎస్​ లోక్​సభ సన్నాహక సమావేశాలు సోమవారం ముగుస్తున్నాయని ఆయన చెప్పారు. 16 లోక్​సభ సన్నాహక సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని అన్నారు.

నల్గొండలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పరిస్థితి బీఆర్​ఎస్​కే అనుకూలంగా ఉన్నట్టు అనిపించిందని, ఓడిపోతమన్న అనుమానం ఎక్కడ కూడా రాలేదని, కానీ సూర్యాపేట ఒక్క సీటులోనే గెలిచామని కేటీఆర్​ పేర్కొన్నారు. నాడు పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు చెప్తున్నారని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు 
నిర్వహిస్తామన్నారు. 

కాంగ్రెస్​కు ప్రజలు దూరమవుతారు

పార్టీ, ప్రభుత్వంపై సోషల్​మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్​ అన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా మాట్లాడటమే మొదలు పెట్టలేదు.. రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలి. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్​వాళ్లు కలలో కూడా అనుకోలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్​రెడ్డి అడ్డగోలు మాటలు చెప్పారని

ఎన్నికలకు ముందు కాంగ్రెస్​నాయకులు ఏం చెప్పారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలకు వివరించాలని బీఆర్​ఎస్​ కార్యకర్తలకు ఆయన సూచించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది. రేవంత్​భుజంపై మోదీ తుపాకీ పెట్టి బీఆర్ఎస్​ను కాల్చాలని చూస్తున్నరు” అని ఆరోపించారు. కేసీఆర్​పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, పార్లమెంట్​ఎన్నికల్లో దానిని సానుకూలంగా మలుచుకోవాలని కార్యకర్తలకు 
సూచించారు.

కాంగ్రెస్​ ఎండ్రికాయల పార్టీ : హరీశ్

గోబెల్స్​ను మించి బీఆర్ఎస్ పై కాంగ్రస్​పార్టీ దుష్ప్రచారం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్​తీరు. అది ఎండ్రికాయల పార్టీ. ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటరు” అని దుయ్యబట్టారు. లోక్​సభ సన్నాహక సమావేశాల్లో 125 గంటల పాటు చర్చ జరిగిందని, కార్యకర్తలు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు.  

20 రోజుల్లోనే పార్లమెంట్​ఎన్నికల కోడ్​వచ్చేస్తుందని, ఆలోగానే కాంగ్రెస్​ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను  నెరవేర్చాలని ఆయన డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్​పేరుతో కేసీఆర్ దేశవ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు సహకరించారని, రాహుల్​ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్ ను ఎదుర్కోవడమే కష్టమని ఆయన అనుకున్నారని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. 

నందినగర్​ఇంటికి కేటీఆర్, హరీశ్.. ప్రముఖుడితో భేటీ!​

నల్గొండ లోక్​సభ సన్నాహక సమావేశం లంచ్​బ్రేక్​లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నందినగర్​లోని నివాసానికి వెళ్లారు. గన్​మన్​లను తెలంగాణ భవన్​లోనే వదిలేసి కేటీఆర్​ కారులో ఇద్దరు కలిసి నందినగర్​లోని ఇంటికి వెళ్లారు. వారిద్దరితో పాటు డ్రైవర్​మాత్రమే కారులో ఉన్నారు. ఒక ప్రముఖుడిని లంచ్​కు ఆహ్వానించారని, ఆయనతో లంచ్​భేటీకే ఇద్దరు నేతలు వెళ్లారని తెలిసింది.

నల్గొండ ఎంపీ టికెట్​ఇంకా ఖరారు కాలే

బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​తో నల్గొండ జిల్లా బీఆర్ఎస్​నాయకులు సోమవారం రాత్రి భేటీ అయ్యారు. గుత్తా అమిత్​రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్​రెడ్డితో పాటు పలువురు నాయకులు కేటీఆర్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. నల్గొండ లోక్​సభ టికెట్​గుత్తా సుఖేందర్​రెడ్డి, అమిత్​లలో ఎవరికి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని వాళ్లు కేటీఆర్​కు చెప్పినట్టు తెలిసింది. నల్గొండ ఎంపీ టికెట్​ఎవరికి ఇవ్వాలనేది ఇంకా ఖరారు కాలేదని, పార్టీ చీఫ్​ కేసీఆర్​ దీనిపై నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. 

ఇంకా మా గొంతు నొక్కుతున్నరు : నల్గొండ బీఆర్ఎస్​ కార్యకర్తలు

లోక్​సభ సమీక్ష సమావేశాల్లోనూ తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్​కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన నల్గొండ లోక్​సభ సన్నాహక సమావేశంలో  కార్యకర్తలు తమ ఆందోళనను వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తమపై కేసులు, రౌడీషీట్లు పెట్టారని గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు కాకుండా వలస వచ్చిన నేతలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తమ బాధలు చెప్పుకుందామన్న ఏ ఒక్క అవకాశం రాలేదన్నారు. కనీసం గ్రామ కమిటీల్లో అవకాశం కల్పించినా పార్టీ కోసం పని చేసేవాళ్లమని వెల్లడించారు.

కమిటీలు లేకపోవడంతోనే పార్టీతో ప్రజలకు సంబంధం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం పోయిందన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న లోక్​సభ సమీక్షా సమావేశాల్లో తమ బాధలు చెప్పుకుందామన్నా విమర్శలు చేయొద్దు అంటూ  పలువురు నేతలు ఆంక్షలు పెడుతున్నారని వివరించారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని, వెంటనే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ హైకమాండ్ ను కోరారు