కేసీఆర్ రెండో హరిత విప్లవానికి నాంది పలికారు

కేసీఆర్ రెండో హరిత విప్లవానికి నాంది పలికారు

రాజన్న సిరిసిల్ల: సీఎం కేసీఆర్ రెండో హరిత విప్లవానికి నాంది పలికారని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన పరిశీలించారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. తనది రైతు ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని కేటీఆర్ అన్నారు. 

మార్కెట్ యార్డ్ పరిశీలన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల మెట్టప్రాంతంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలో ఈసారి 2.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా పెట్టుకుంటే దాదాపు 3.23 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించాల్సి వస్తోంది. రెండో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా నడి వేసవిలో అప్పర్ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకుతోంది. ఎక్కడో కాళేశ్వరం నుంచి నీటిని తెచ్చి అప్పర్ మానేరు నింపాం. ఎండిన పంట పొలాలకు నీళ్లియ్యడంతో రైతులంతా సీఎంను ఆశీర్వదిస్తున్నారు. ఈనెల 15 నుంచి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఈలోగా భూ సమస్యలేమైనా ఉంటే కలెక్టరేట్‌కు వచ్చి పరిష్కరించుకోండి. ఫారెస్టు అధికారులతో సమన్వయం చేసుకుని అటవీ భూముల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నష్టం కాకుండా చూసి గతంలో కంటే ఎక్కువ మందికి రైతుబంధు వచ్చేలా అధికారులు చూడాలి. సిరిసిల్ల రైతులకు వేదికంగా ఉండేందుకు 22 కోట్లతో అధునాతన మార్కెట్ యార్డు నిర్మించాం. ఈనెల 11న వ్యవసాయ మంత్రి దీన్ని ప్రారంభిస్తారు’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.