కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైంది..రెండున్నరేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే: కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైంది..రెండున్నరేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే: కేటీఆర్
  • హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నరని ఫైర్
  • సర్​ విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు పిలుపు

చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్​పాలనలో రాష్ట్రంలో రియల్​ఎస్టేట్ రంగం​ఆగమైందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆరోపించారు. ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేశారని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నరని ఫైర్ అయ్యారు. చేవెళ్ల మున్సిపల్​పరిధిలోని మల్కాపూర్ లో ఓ ఫంక్షన్​హాల్​లో గురువారం చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్​ బూత్ స్థాయి సమావేశం, సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్​హాజరై మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అప్పుల పేరు చెప్పి, తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓటమి వల్ల కేసీఆర్​కు  జరిగిన నష్టం ఏమీ లేదని.. కానీ, కార్యకర్తలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. కాంగ్రెస్​ సర్కారు గడిచిన రెండున్నరేండ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు. మహిళలను  కోటీశ్వరులను చేస్తానని రేవంత్ మాటతప్పారని, వారిని కోటీశ్వరులను చేసుడు కాదు.. మహాలక్ష్మి పైసలు రూ.లక్షా 50 వేలు ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తనదని కేటీఆర్ అన్నారు.

2028లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ గుర్తుపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్లేటు ఫిరాయించారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. సర్​విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా, దొంగ ఓట్లు రాకుండా చూడాలని సూచించారు. అనంతరం  మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇంద్రారెడ్డి కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.   ఈ సమావేశంలో కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి బాబురావు తదితరులు పాల్గొన్నారు.