
- డబ్బున్న పెద్దల జోలికి హైడ్రా ఎందుకు పోదు?: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, ప్రజల ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. డబ్బున్న పెద్దల జోలికి హైడ్రా ఎందుకు పోదని ఆయన ప్రశ్నించారు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ముందా? అని నిలదీశారు. బుధవారం తెలంగాణభవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్డివిజన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచి తీరాలని కేటీఆర్అన్నారు. అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరూ కోరుకోనిదని.. గోపీనాథ్ హఠాత్తుగా అందరికీ దూరమవుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ఆదుకున్నారని.. ఇప్పుడు ఆయన కుటుంబానికే కష్టమొచ్చిందని.. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్ మెజార్టీ కోసం కృషి చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. యుద్ధంలా పోరాడితేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మన బతుకమ్మ పాటలొస్తున్నయ్..
- ప్రతి గల్లీలో మార్మోగాలి
బతుకమ్మ పండుగకి బీఆర్ఎస్ తరఫున జోర్దార్ పాటలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగ జరిగినన్ని రోజులూ ప్రతి గల్లీ, ప్రతి బస్తీలోనూ ఆ పాటలు మార్మోగాలని సూచించారు. ఆ పాటలు దద్దరిల్లేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. జనంలో కాంగ్రెస్‌పై ఎంత కోపం ఉందో.. కేసీఆర్‌పై ఎంత అభిమానం ఉందో గణేశ్ నిమజ్జనం సందర్భంగా తేలిపోయిందన్నారు.
హుస్సేన్‌సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర, ఇతర చోట్ల కేసీఆర్ పాటలు మార్మోగాయని.. పోలీసులు ఆపాలని చూసినా ఎవరూ ఆగలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి అటూ ఇటూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం, సీఎం అబద్ధపు మాటలు మాట్లాడడం చూసి జనానికి కోపం వచ్చిందన్నారు.