మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మనందరిది

మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మనందరిది

సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. షేక్ పేట్ లో రూ.333 కోట్ల వ్యయంతో 2 కిలో మీటర్లకు పైగా ఆరు లేన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టోలిచౌకీ నుంచి రాయదుర్గాన్ని కలిపే ఈ ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఏడాదిని సరికొత్తగా ఆరంభిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గించడానికి ఇదో మైలురాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ ను చీఫ్ ఇంజినీర్ చేతుల మీదుగా కేటీఆర్ రిబ్బన్ కట్ చేయించారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తదితరులు పాల్గొన్నారు.

‘ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన SRDP పథకంలో 24 పనులు అందుబాటులోకి వచ్చాయి. అందుకోసం ఆరు వేల కోట్లు ఖర్చు చేశాం. దాంతో ట్రాఫిక్ సమస్యకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎస్ఆర్ డీపీ, హెచ్ ఆర్ డీసీఎల్ ద్వారా లింకు రోడ్లు, సీఆర్ఎంపీ పథకం ద్వారా ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. రూ. 100 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వం మూడు సహాయాలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా కోరుతున్నాను. మొదటిది.. SRDPలో చేపట్టే ప్రాజెక్టులకు కోసం రక్షణ శాఖ భూములు అవసరం అవుతుంది.. వాటిని ఆయన ఇప్పించాలి. రెండోది.. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను మూసేస్తున్నారు.. వాటిని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మూడోది హైదరాబాద్ నగరంలో కి వచ్చే ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల వద్ద భారీ ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తున్నాం. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు భారీ స్థాయి నిర్మాణం చేస్తున్నాం. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తుర్కపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్లాన్ చేశాం. రక్షణశాఖ భూములను మాత్రం మనకు కేటాయించడం లేదు వాటిని అప్పగించేలా కిషన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కేంద్రం సహకరిస్తూ అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉంది.