- కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ‘ఎగువ మధ్య- ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, పరిపాలనా దక్షతకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.4.19 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ.. ప్రపంచ బ్యాంక్ ఎగువ మధ్య -ఆదాయ కేటగిరీలో చేరిందని, ఈ మైలురాయిని సాధించిన 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అసాధారణ ఆర్థిక పరివర్తనకు ఈ విజయమే అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, కేవలం పదేండ్ల వ్యవధిలోనే తన ఆర్థిక తలరాతను తిరగరాసుకుందని పేర్కొన్నారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని కొనియాడారు. పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి పెట్టుబడులను ఆకర్షించిన టీఎస్-ఐపాస్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు బలమైన పునాది వేశాయని వివరించారు. కానీ, రాష్ట్రం దివాళా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
