కాంగ్రెస్ హామీలు అమలు కాలే వంద రోజుల్లో అన్నరు.. వెయ్యి రోజులైనా అమలుకు నోచుకోలే: కేటీఆర్‌‌‌‌ 

కాంగ్రెస్ హామీలు అమలు కాలే వంద రోజుల్లో అన్నరు.. వెయ్యి రోజులైనా అమలుకు నోచుకోలే: కేటీఆర్‌‌‌‌ 
  • అక్రమాలపై ఢిల్లీ పెద్దల మౌనం.. ముడుపులే కారణం 
  • మోదీ, బీజేపీని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌‌‌‌కు లేదు 
  • 2028లో మళ్లీ కేసీఆరే సీఎం అని ధీమా

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌‌‌‌.. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిపోయినా వాటిని అమలు చేయలేదని బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రజల మధ్య మత విభజనలు సృష్టిస్తుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌‌‌‌ సర్కారు తెలంగాణను దోచుకుంటున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆయనకు ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు జరుగుతున్నా.. ముడుపులు అందుతున్నందుకే ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌లో ఖైరతాబాద్‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌‌‌‌ మైనారిటీ నేత జిబ్రాన్‌‌‌‌ షరీఫ్‌‌‌‌ తన అనుచరులతో కలిసి కేటీఆర్‌‌‌‌ సమక్షంలో బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌‌‌‌లోని అశోక్‌‌‌‌నగర్‌‌‌‌ టీ కొట్టు వద్ద నిరుద్యోగులకు పెద్దపెద్ద హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేంద్రంలోని బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో బెదిరింపులకు దిగుతుంటే.. రాష్ట్రంలో రేవంత్‌‌‌‌ సర్కారు పోలీసు కేసులతో భయపెడుతోందని ఆరోపించారు. మైనారిటీ డిక్లరేషన్‌‌‌‌ ఏమైంది?

మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్‌‌‌‌ ప్రకటించిన కాంగ్రెస్‌‌‌‌.. అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కనపెట్టిందని కేటీఆర్‌‌‌‌ విమర్శించారు. బడ్జెట్‌‌‌‌లో మైనారిటీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై నిలదీస్తే సమాధానం చెప్పాల్సిన సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి తిట్లతో ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.

రేవంత్‌‌‌‌ పాలనలో ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆరోపించారు. మార్కెట్‌‌‌‌లో రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తన సోదరుడికి ఎలా బహుమతిగా ఇచ్చారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అమెరికాలో ఉంటున్న మరో సోదరుడికి సంబంధించిన రూ.1,000 కోట్ల డీల్‌‌‌‌ వివరాలను బయటపెట్టాలని, ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.