
తెలంగాణలో కేసీఆర్ పాలనను చూసి పక్క రాష్ట్రాలు అసూయపడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లలో లక్షా 32 వేల 899 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, దేశంలో కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పిన మాటల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. గద్వాల జిల్లాలో పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలంపూర్ చౌరస్తాలో 100 పడకల హాస్పిటల్‌కు భూమిపూజ చేశారు. తర్వాత జూరాల ప్రాజెక్టు దగ్గర పార్కుకు భూమిపూజ చేశారు. అక్కడి నుంచి గద్వాల వెళ్లి ఆడిటోరియం, షాదీఖానాకు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో గద్వాల ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలో 104 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించామని, 15 కోట్లతో జూరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
70 ఏళ్లలో జరగని అభివృద్ది గద్వాలలో 7 ఏళ్లలో జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. చరిత్రనే తప్ప, భవిష్యత్తు లేని పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కొంత మందికి మింగుడుపడుతలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన పార్టీకి పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ ఏడేళ్లలో 13 మెడికల్ కాలేజీలు పెట్టామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్‌ను తిడితే టీవీలో, పేపర్‌లో వార్తలు రాస్తారని కొంతమంది కావాలని అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు.