
అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా నిన్న(అక్టోబర్ 19) భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందని.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని విమర్శించారు.
- ALSO READ | తెలంగాణ ఇచ్చింది.. దొరల కోసం కాదు: రాహుల్ గాంధీ
రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "టికెట్లు అమ్ముకున్నారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని మహాత్మ గాందీజీ అన్నారు. ఇలాంటివారు కాంగ్రెస్ లో ఉంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో?. పీసీసీ పోస్టును రూ.50కోట్లకు అమ్మారని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. పార్టీలో ఇంత అవినీతి ఉన్నా.. అక్రమాలపై రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదం" అని కౌంటర్ ఇచ్చారు.