కేసీఆర్ ను ఓడించేందుకు ఇంత మంది అవసరమా?: కేటీఆర్

కేసీఆర్ ను ఓడించేందుకు ఇంత మంది అవసరమా?: కేటీఆర్

ఒక్క కేసీఆర్ ను ఓడించేందుకు చాలా మంది ఏకమయ్యారని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని.. కేసీఆర్ ను ఓడించేందుకు ఇంత మంది అవసరమా? అని అన్నారు. కేసీఆర్ సింగిల్ గానే వస్తడు..గెలుస్తడు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  ఆదివారం(నవంబర్ 5) కల్వకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

 మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.. ఇతర రాష్ట్రాల్లో లేదని చెప్పారు. 50ఏళ్ల పాటు ఏం చేయని కాంగ్రెస్.. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుతున్నారని.. కాంగ్రెస్ వస్తే, తెలంగాణ మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని చెప్పారు.  కర్నాటకలో 5 గంటలే కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారని.. కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోవద్దన్నారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. గిరిజనులకు బంజారాహిల్స్ లో బంజారా భవన్ ను నిర్మిస్తున్నామని చెప్పారు.  

కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా వచ్చేది కష్టమేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు డబ్బుులు ఇస్తే తీసుకుని బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పారు. కేసీఆర్ మీద కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్నికల పోటీలో ఉండననని పారిపోయాడని.. బీజేపీతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.