కర్నాటకలో 5గంటలే కరెంట్ ఇస్తున్నట్లు డీకే శివకుమార్ చెప్పారు: కేటీఆర్

కర్నాటకలో 5గంటలే కరెంట్ ఇస్తున్నట్లు డీకే శివకుమార్ చెప్పారు: కేటీఆర్

కర్నాటక రైతులు.. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారని. కర్నాటకలో కరెంట్ కోతలు ఉన్నాయని ఇక్కడి ప్రజలకు వివరిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేయవద్దని కర్నాటక రైతులు  విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 29) నగరంలోని ఎల్బీనగర్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  వికారాబాద్ జిల్లాలో ప్రచారానికి కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను  రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని,  కర్నాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారన్నారు.

కరెంట్ కోసం  కర్నాటకలో పారిశ్రామిక వేత్తలు, రైతులు రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్నారని తెలిపారు. 2014కు ముందు విద్యుత్ సరఫరా ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గుర్తించాలని కోరారు. 2014కు ముందు కరెంట్ కోతల గురించి అడిగితే పట్టించుకునే నాథుడే లేడని.. ఇప్పుడు ఏదైనా సమస్య వల్ల  10 నిమిషాలు  కరెంట్ పోతే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్యంలో విద్యుత్ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దారో ప్రజలు ఆలోచించాలన్నారు.

హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజనీకాంత్ ప్రశంచించారని.. ఎల్బీ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను కలుపుతూ పెద్ద అంబర్ పేట్ వరకు మెట్రో సేవలు విస్తరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి మధయాష్కి గౌడ్ కు ఎల్బీ నగర్ గురించి ఏం తెలుసని అన్నారు.  ఒకప్పుడు ఎల్బీనగర్ లో ట్రాఫిక్, నీళ్ల సమస్యలు ఉండేవని.. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. 

 కాంగ్రెస్ వస్తే.. తెలంగాణలో మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయని...  కాంగ్రెస్ అంటేనే కష్టాలు.. కన్నీళ్లు.. మతకల్లోలు అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటల నమ్మి మోసపోవద్దని... ప్రజల కష్టాలు తీర్చే కేసీఆర్ నే మరోసారి గెలిపించాలని  కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.