హత్యకు గురైన మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

హత్యకు గురైన మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కావన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల హత్యకు గురైన మాజీ సైనికుడు, బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.  జనవరి 14వ తేదీ ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా గంట్రావుపల్లి గ్రామానికి వెళ్లిన  కేటీఆర్... మల్లేష్ కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. అన్ని విధాల మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మల్లేష్ యాదవ్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్ధిక సాయం, పిల్లల భవిష్యత్తు తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఇలాంటి హత్యలు జరగలేదన్నారు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద గాని, కాంగ్రెస్ నాయకుల మీద దాడులకు తెగబడలేదని, ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదన్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరే, ఈ దురదృష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు.  ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ కక్షతో మల్లేష్ ను హత్య చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గమన్నారు. 

రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ మొత్తం తరలివస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్తకు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.ఈ హత్యపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి..  రాజకీయ హత్యని, భూ వివాద హత్యగా చిత్రీకరించకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.