ఈటలతో కేటీఆర్ ​లంచ్​ మీటింగ్​

ఈటలతో కేటీఆర్ ​లంచ్​ మీటింగ్​

అంతకుముందు అసెంబ్లీలోనూ చర్చలు
టీఆర్​ఎస్​లో ప్రకంపనలు సృష్టించిన ఈటల కామెంట్లు


మంత్రి ఈటల రాజేందర్​ ఆదివారం చేసిన కామెంట్ల నేపథ్యంలో టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఆయనతో  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ నుంచి ఈటలను తన కారులో ప్రగతిభవన్​కు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈటల రాజేందర్ ఆదివారం తన నియోజకవర్గం హుజూరాబాద్ లోని వీణవంకలో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, పింఛన్లతో పేదరికం పోదని, పరిగె ఏరుకుంటే పంట పండించినట్లు కాదని కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉండటంతో  టీఆర్​ఎస్​ నేతలు కలవరపడ్డారు. ఈటల కామెంట్లపైనే సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది. గులాబీ జెండా ఓనర్లం తామేనని గతంలో ఆయన చేసిన ప్రకటనను కూడా వారు గుర్తుచేసుకున్నారు.
  
మండలి నుంచి అసెంబ్లీకి వచ్చి..

సోమవారం మండలిలో క్వశ్చన్​ అవర్​లో పాల్గొన్న మంత్రి కేటీఆర్​ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నేరుగా అసెంబ్లీకి వచ్చి అక్కడ సభలో ఉన్న ఈటల రాజేందర్​ను పలకరించారు. తర్వాత బయటికి రమ్మని కోరారు. ఇద్దరూ ముందుగా ఇన్నర్ లాబీల్లో దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేటీఆర్ కారులో ప్రగతిభవన్ కు వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ప్రగతిభవన్​లో ఈటల గడిపారు. అక్కడే ఈటల, కేటీఆర్​ కలిసి భోజనం చేశారు.  

ఈటల నో కామెంట్

ప్రగతిభవన్​కు  వెళ్లిన విషయంపై ఈటల రాజేందర్ వద్ద ప్రస్తావిస్తే.. ‘‘ఆ ఒక్క విషయం తప్ప ఏం అడిగినా చెపుతా..’’ అని అన్నారు.
ఈటల రాజేందర్ తో కలిసి కేటీఆర్ సమావేశం కావడం వెనుక సీఎం కేసీఆర్ ఆదేశాలు ఉన్నట్టు టీఆర్​ఎస్​ లీడర్ల మధ్య చర్చ జరుగుతోంది. గతంలో ‘గులాబీ జెండా ఓనర్లం మేమే’ అని ఈటల మాట్లాడినప్పుడు కూడా ఆయనతో కేటీఆర్  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్  నందినగర్​లో ఉన్న కేసీఆర్ ఇంటికి ఈటలను పిలుచుకుని దాదాపు నాలుగు గంటల పాటు కేటీఆర్​ చర్చించారు. అప్పుడు కేసీఆర్​ ఆదేశాల మేరకే ఈటలతో కేటీఆర్​ భేటీ అయ్యారని, ఇప్పుడు సమావేశం అవడం వెనుక కూడా కేసీఆర్ డైరెక్షన్ ఉండొచ్చని లీడర్లు భావిస్తున్నారు. 

తెలంగాణ భవన్ నుంచి ప్రగతిభవన్ వరకు 

గత నెల తెలంగాణ భవన్ లో టీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో కేసీఆర్ కీలక కామెంట్లు చేశారు.‘‘ పార్టీ పెట్టినోళ్లు ఎవరూ సక్సెస్ కాలే. అంత ఈజీ కాదు. ఎంతో శ్రమ కావాలి. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ పార్టీలు పెట్టినా మట్టిలో కలిసి పోలేదా?’’ అని అన్నారు. ఈ కామెంట్లు ఈటలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లు టీఆర్​ఎస్​ లీడర్ల మధ్య చర్చకు దారితీసింది. ఆ తర్వాత నుంచి ఈటలకు,  ప్రగతిభవన్ కు దూరం పెరిగినట్లు లీడర్లు చెప్తున్నారు. వారం రోజుల కింద సీఎం కేసీఆర్​ మంత్రులతో భేటీ అయినప్పుడు అందుబాటులో ఉన్న మంత్రి ఈటలను పిలువలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​చార్జి బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు బాధ్యతలు ఇచ్చి, అదే జిల్లాకు చెందిన ఈటలకు ఇవ్వకపోవడం వంటి పరిణామాలు టీఆర్​ఎస్​ లీడర్లలో చర్చకు కారణమయ్యాయి. ఇలాంటి కొన్ని ఘటనల వల్ల ఈటల మనస్తాపం చెందారని, అందుకే తన నియోజకవర్గంలో సంచలన కామెంట్లు చేశారని లీడర్లు అంటున్నారు.