సాధిస్తా అనే మంత్రి కావాలె.. సాధ్యం కాదనేవాళ్లెందుకు?

సాధిస్తా అనే మంత్రి కావాలె.. సాధ్యం కాదనేవాళ్లెందుకు?

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. కేంద్రప్రభుత్వ సంకల్ప లోపమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శాపంగా మారిందన్నారు. అలవాటైన వివక్షనే బయ్యారం ప్లాంట్ విషయంలోనూ మోడీ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. పార్లమెంటు సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కిన హామీని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు కేటీఆర్. కొత్త ప్లాంట్ పెట్టే ఆలోచనే లేదన్న కేంద్రప్రభుత్వం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని పాత ప్లాంట్ల ఆధునీకరణకు రూ. 71 వేల కోట్లు  ఖర్చు చేసిందన్నారు. బయ్యారానికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగం అయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కేంద్రం నుంచి కనీస స్పందన లేదన్నారు కేటీఆర్. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేమంటూ కిషన్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ఆ ప్రకటన కిషన్ రెడ్డి వ్యక్తిగతమో లేదంటే  కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయమో చెప్పాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పష్టం చేయాలన్నారు కేటీఆర్. కిషన్ రెడ్డి ప్రకటనతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న గిరిజన యువత ఆశలకు ఉరివేశారన్నారు. తెలంగాణ ప్రయోజనాలను సాధించాల్సిన కిషన్ రెడ్డి సాకులు చెబుతూ నిస్సహాయమంత్రిగా మారిపోయారన్నారు. సాధిస్తా అని చెప్పే మంత్రి కావాలి కానీ.. సాధ్యం కాదని చెప్పే మంత్రి తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్.