హైదరాబాద్ కు కుమ్మెర బాధితులు!

హైదరాబాద్ కు కుమ్మెర బాధితులు!
  • పోలీసులకు చెప్పకుండానే గణేశ్​ దంపతులను తరలించిన ధర్మ సమాజ్ పార్టీ 

నాగర్​కర్నూల్, వెలుగు: కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలంటూ నాగర్​కర్నూలులో నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని గురువారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండానే ఖాళీ చేశారు. బాధితులు గణేశ్​, మౌనిక దంపతులను కారులో ఎక్కించుకుని ధర్మ సమాజ్​ పార్టీ (డీఎస్పీ) నాయకులు రఘు, సాయి హైదరాబాద్​కు తరలించినట్టు తెలుస్తోంది. బాధితులు కనిపించకపోవడం, శిబిరాన్ని ఎత్తివేయడంతో ఏం జరిగిందోనని అర్థం కాక పోలీసులు టెన్షన్​ పడ్డారు. సీసీ ఫుటేజీని పరిశీలించి డీఎస్పీ నేతలు వారిని తరలించినట్లు గుర్తించారు. 

తమకుగానీ, రెవెన్యూ అధికారులకుగానీ సమాచారం ఇవ్వకుండానే గణేశ్, మౌనికను తరలించారని నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్​ చెప్పారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని చెక్​పోస్టులను, పోలీస్​ స్టేషన్లను అలర్ట్​ చేశారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. కాగా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్​లో ధర్నా చేపట్టాలని డీఎస్పీ భావించింది. గురువారం మధ్యాహ్నం ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్​ విశారదన్​ మహరాజ్​ శిబిరం దగ్గర చెప్పినట్టు సమాచారం. 

శాంతిభద్రతల సాకుతో శిబిరాన్ని పోలీసులు ఎత్తివేస్తారని, బాధితులకు వ్యతిరేకంగా, నిందితులకు మద్దతుగా పోటీ ధర్నా నిర్వహించాలని కుమ్మెర గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా..  కుమ్మెర ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్ ను దిగ్బంధిస్తామని, ముఖ్యమంత్రి ఇంటిని, సెక్రటేరియెట్ ను ముట్టడిస్తామని బీఆర్ఎస్  ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్  యాదవ్  హెచ్చరించారు. గురువారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.