కేటీఆర్​కు మతిభ్రమించింది .. ఎన్నికల్లో ఓడినా పొగరు తగ్గలేదు : కూనంనేని

కేటీఆర్​కు మతిభ్రమించింది ..  ఎన్నికల్లో ఓడినా పొగరు తగ్గలేదు :  కూనంనేని

హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల్లో ఓడిన నాలుగైదు రోజుల నుంచే ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి రోజుకో స్టేట్​మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. జనాలు కరెంట్ బిల్లులు కట్టొద్దని, వాటిని సోనియాగాంధీకి పంపాలని చెప్పడం ప్రజాస్వామ్యబద్ధమేనా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్​రావు కామెంట్లు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరితహోటల్​లో ఆదివారం నిర్వహించిన సీపీఐ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు.

 అంతకుముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ‘‘ఒక వైపు రోజుకో శాఖ నుంచి శ్వేతపత్రం విడుదల చేస్తుంటే.. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నరు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ లీడర్లు వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిందిపోయి.. ప్రభుత్వం కూలిపోతుందన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్?’’అని కూనంనేని ప్రశ్నించారు. 

ఒక ఎంపీ సీటు ఇవ్వండి

ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ లీడర్ల పొగరు, నియంతృత్వ పోకడలు తగ్గలేదని, తమకు తప్ప పాలించే హక్కు ఎవరికీ లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని కూనంనేని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల గడువు ఉందని, అప్పటిదాకా బీఆర్​ఎస్ లీర్లు వెయిట్ చేయలేరా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒకట్రెండు సీట్లే వస్తాయన్నారు. సింగరేణితో పాటు ఆర్టీసీ, బ్యాంకులు, అంగన్​వాడీ, మెడికల్ తదితర రంగాల్లో ఎర్రజెండా అభిమానులే ఉన్నారని తెలిపారు. వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి, నల్గొండలో ఏదైనా ఒక సీటు తమకు కేటాయించాల్సిందిగా కాంగ్రెస్​ను కోరుతున్నట్లు చెప్పారు.

బీజేపీది అంతా మోదీ జపం

బీజేపీది రామజపం కాదని, మోదీ జపం అని కూనంనేని విమర్శించారు. ప్రజల్లో హిందుత్వ సెంటిమెంట్ రెచ్చగొట్టి, తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నదన్నారు. రాముడు అందరి దేవుడే అయినా.. బీజేపీ రాముడి పేరుతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. రామ మందిరం విషయంలో ఆచారాలు, శాస్త్ర పద్ధతులను మోదీ పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, పార్టీ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.