హాంకాంగ్ సిక్సర్స్‌లో టీమిండియాకు బిగ్ షాక్. పూల్ సి మ్యాచ్‌లో కువైట్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడింది. శనివారం (నవంబర్ 8) జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో ఓడిపోయి క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంలో విఫలమైంది. మొదట విఫలమైన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ పోరాడకుండానే చేతులెత్తేశారు. భారత జట్టు పాకిస్థాన్ పై గెలిచినా నెట్ రన్ రేట్ కారణంగా తదుపరి దశకు చేరుకోలేకపోయింది. పూల్ సి నుంచి కువైట్ తో పాటు పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. కెప్టెన్ యాసిన్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే 58 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పటేల్ ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లతో పాటు 2 ఫోర్లున్నాయి. బిలాల్ తాహిర్ 9 బంతుల్లోనే 25 పరుగులు చేసి అదిరిపోయే క్యామియో ఆడాడు. ఇండియా బౌలర్లలో మిథున్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. పంచల్ ఒక్క ఓవర్ వేసి 32 పరుగులు ఇవ్వడం టీమిండియాకు మైనస్ గా మారింది.
106 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లు కూడా ఆడలేకేపోయింది. 5.4 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. రాబిన్ ఉతప్ప తొలి బంతికే డకౌట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆడుకుంటాడనుకున్న కెప్టెన్ దినేష్ కార్తీక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బిన్నీ, పంచల్ కూడా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరడంతో ఇండియా ఓటమి ఖారారైంది. చివర్లో మిథున్ (9 బంతుల్లో 26), షాబాజ్ నదీమ్ (8 బంతుల్లో 19) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. కువైట్ కెప్టెన్ యాసిన్ పటేల్ 3 వికెట్ల పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు.
