భరతనాట్యం ఫ్రెష్ ఫీల్‌‌నిస్తుంది : కేవీఆర్ మహేంద్ర

భరతనాట్యం ఫ్రెష్ ఫీల్‌‌నిస్తుంది : కేవీఆర్ మహేంద్ర

‘దొరసాని’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్న కేవీఆర్ మహేంద్ర రూపొందించిన రెండో సినిమా ‘భరతనాట్యం’. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని పాయల్ సరాఫ్ నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘‘దొరసాని’ అనేది పీరియాడిక్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తీసిన పొయిటిక్‌‌ లవ్ స్టోరీ. కచ్చితంగా కొన్నిటికి కట్టుబడే ఆ సినిమా చేయాలి. కానీ దీనికి ఎలాంటి హద్దులు లేవు. ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏ అంశాలు కావాలో అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో కుదిరాయి.

సూర్య తేజ ఈ కథను  రాశాడు. అయితే తను హీరోగా చేద్దామనుకోలేదు. రచయిత ప్రతి పాత్రలోకి వెళ్లగలడని భావించి నేనే తనను హీరోగా నటించమని కోరా. మంచి స్క్రీన్‌‌ప్లే మాటలు రాయగలిగితే కమర్షియల్‌‌గా వర్కవుట్ అవుతుందని నమ్మకం వచ్చింది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. అనుకోకుండా ఓ క్రైమ్‌‌లో ఇరుక్కుని, దాన్నుంచి ఎలా బయటపడ్డాడనేది మెయిన్ కాన్సెప్ట్‌‌.  ఇది హీరో, హీరోయిన్ కథలా ఉండదు.  వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ గత చిత్రాలకు భిన్నమైన పాత్రలు ఇందులో పోషించారు.

కొత్తరకం పాత్రలతో సినిమా ఫ్రెష్ ఫీల్‌‌నిస్తుంది. భరతనాట్యం నృత్యాన్ని స్టేజ్‌‌పై చూసి  ప్రేక్షకుడు ఎలాంటి ఆనందం పొందుతాడో,  ఈ సినిమా కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. అంతే తప్ప ఇదేమీ డ్యాన్స్‌‌కు సంబంధించిన కథ కాదు. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీక్వెన్స్‌‌లు ఉంటాయి.  వివేక్ సాగర్ మ్యూజిక్  నెక్స్ట్ లెవల్‌‌లో ఉంటుంది’ అని చెప్పాడు.