హేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు

హేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు

హైదరాబాద్, వెలుగు: హేమంత్​ హత్యలో నిందితులు కూలీలుగా తేలింది. యుగేంధర్​రెడ్డితో ఉన్న పరిచయం, డబ్బుకు ఆశపడే హత్య చేయటానికి అంగీకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గతంలో యుగేంధర్​రెడ్డి ట్యాంకర్​ డ్రైవర్​గా పనిచేసే సమయంలో పంది మాంసం అమ్మే కృష్ణ, పెయింటర్​గా పనిచేసే బిచ్చుయాదవ్​, ఎలక్ర్టీషియన్​గా పనిచేసే ఎండీ పాషా అతనికి ఫ్రెండ్స్ అయ్యారు. తన అక్క ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ వల్ల వాళ్లు పడుతున్న బాధను చెప్పి, డబ్బును ఆశగా చూపి, వారిని మర్డర్ కు ఒప్పించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే, పోలీసుల నిర్లక్ష్యానికి హేమంత్ బలైపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కాగా ప్లాన్ వేసి..  

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అవమానంగా భావించిన అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన తీవ్ర మనోవేదన చెందారు. హేమంత్ మీద కక్ష పెంచుకున్నారు. ఈక్రమంలో పలుసార్లు తన అక్క అర్చన ఇంటికి వచ్చిన యుగేంధర్ రెడ్డి వారి బాధను చూసి కోపంతో రగిలిపోయాడు. హేమంత్ ను మర్డర్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు అతని బావ లక్ష్మారెడ్డి కూడా ఒప్పుకొన్నాడు. ఈ క్రమంలోనే నెల కిందట  మర్డర్ కు ప్లాన్ వేశారని పోలీసుల విచారణలో తేలింది. ఎరుకలి కృష్ణ, బిచ్చుయాదవ్​, లడ్డూ అలియాస్ ఎండీ పాషాలతో మాట్లాడి హత్యకు ఒప్పించాడు. రూ. 10 లక్షలకు కిరాయి మాట్లాడుకుని, తన బావతో అడ్వాన్స్ గా రూ. లక్ష ఇప్పించాడు. ప్లాన్ లో భాగంగా.. యుగేంధర్ రెడ్డి అన్న విజేందర్ రెడ్డి… హేమంత్, అవంతి ఉంటున్న కాలనీ, అడ్రస్ సేకరించాడు. ఇదేసమయంలో హేమంత్ పేరెంట్స్ ఉండే ఇల్లు తమ ఇంటికి దగ్గరే ఉండటం.. అవంతి, హేమంత్ లు రెండుసార్లు వాళ్లింటికి వచ్చిపోవడంతో లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు మరింతగా రగిలిపోయారు. ఇదంతా మనసులో దాచుకుని, అవంతితో మాటలు కలిపారు. హేమంత్, అవంతిల కదలికలను తెలుసుకుని, రెక్కీ చేసి గురువారం హేమంత్ ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. మర్డర్ లో లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులందరి పాత్ర ఉందని పోలీసులు చెప్పారు.

ముగిసిన అంత్యక్రియలు

హేమంత్ అంత్యక్రియలు శనివారం హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని శ్మశానవాటికలో ముగిశాయి. పోస్టుమార్టం తర్వాత ఉస్మానియా ఆస్పత్రి నుంచి డెడ్ బాడీని చందానగర్ తారానగర్ లోని ఇంటికి తీసుకెళ్లగా.. హేమంత్ భార్య అవంతి, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసుల బందోబస్తు మధ్య తారానగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు అంతిమయాత్ర కొనసాగింది. ​లండన్ నుంచి వచ్చిన హేమంత్ ​తమ్ముడు సుమంత్.. తన అన్న పెళ్లి చేసుకున్నప్పటి నుంచే తమకు బెదిరింపులు మొదలయ్యాయని సుమంత్ చెప్పారు. తనకు ఫోన్లు చేసి బెదిరించారని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అని ప్రశ్నించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ​చేశారు.

For More News..

హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లు.. కొబ్బరి నీళ్లెప్పుడైతయ్

బీజేపీ నేషనల్ కమిటీలో లక్ష్మణ్, డీకే అరుణ