వాట్సాప్ ఫొటోలతో యువతికి వేధింపులు

వాట్సాప్ ఫొటోలతో యువతికి వేధింపులు

యువకుడిని అరెస్టు చేసిన
రాచకొండ క్రైమ్ పోలీసులు

ఎల్ బీ నగర్,వెలుగు: తన ప్రేమను అంగీకరించకపోవడంతో..ఓ యువతి తనతో దిగిన ఫొటోలను వాట్సాప్ లో పెట్టి ఆమెను వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన గుగులోతు గణేశ్(21) సిటీలోని కాచిగూడలో ఉన్న ఎస్వీఎస్ న్యూరో ఆస్పత్రిలో మేల్ నర్స్ గా పనిచేసేవాడు. అదే సమయంలో  హాస్పిటల్ లో పనిచేస్తున్న ఓ యువతితో గణేశ్​కు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల వరకు వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. తర్వాత ఇద్దరూ అక్కడ జాబ్ మానేశారు. ఆ యువతి బంజారాహిల్స్ లోని ఓ  హాస్పిటల్ లో పనిచేస్తుండగా.. గణేశ్ ఖమ్మంలోని ప్రశాంత్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు.

గణేశ్ గత కొద్ది రోజులుగా ఆ యువతికి ఫోన్ చేసి తనను ప్రేమించాలని..తన కోరిక తీర్చాలని వేధించసాగాడు. ఇందుకు ఆ యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్న గణేశ్ ఎలాగైనా ఆమె పరువు తీయాలని భావించాడు.  కాచిగూడలో పనిచేస్తున్న సమయంలో ఆ యువతితో సన్నిహితంగా ఉన్నప్పుడూ దిగిన ఫోటోలను గణేశ్ ఎస్వీఎస్ హాస్పిటల్ వాట్సాప్ లో షేర్ చేశాడు. దీంతో పాటు గణేశ్​ఆ ఫొటోలను ఫేస్ బుక్ లోనూ పోస్టు చేశాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గణేశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ తెలిపారు.