
- వారంలో ఒకరోజు వారితోనే..
- ఎస్పీ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అమలు
- మానసిక దృఢత్వంపై స్పెషల్ క్లాసెస్
- సైబర్ నేరాలు, భద్రత చట్టాలపై అవగాహన
నిర్మల్, వెలుగు: కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వారంలో ఒక రోజంతా వారితోనే గడుపుతున్నారు. సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు. నిర్మల్ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ‘కేజీబీవీల్లో పోలీస్ అక్కలు’ మంచి ఫలితాలు ఇస్తోంది. కొత్త వాతావరణం, ఒత్తిడి, పోటీ, ఆరోగ్యం వంటి అంశాలు కేజీబీవీల్లో చదివే విద్యార్థినులపై అధిక ప్రభావం చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇలాంటి సమస్యల కారణంగా వారు చదువుల్లో వెనుకబడడం, మానసిక ఒత్తిడికి గురై కొంతమంది విద్యాలయాన్ని వదిలి ఇండ్లకు వెళ్లిపోతున్నట్లు ఎస్పీ తెలుసుకున్నారు. దీంతో కేజీబీవీ విద్యార్థినులకు అండగా నిలిచేందుకు ‘పోలీస్ అక్క’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని కేజీబీవీల పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి కొంత మంది మహిళా పోలీసులను నియమించారు. వారంలో ఒకరోజు కేజీబీవీల్లో విద్యార్థులతో ఉత్సాహంగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాత్రి నిద్ర కూడా అక్కడే..
పోలీస్ అక్కలు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేజీబీవీల్లో వారంలో ఒకరోజు 24 గంటల పాటు విద్యార్థినులతో కలిసి ఉంటారు. వారితో కలిసి అల్పాహారం నుంచి మొదలుకొని లంచ్, డిన్నర్ చేయడంతోపాటు రాత్రి అక్కడే బసచేస్తారు. ఈ క్రమంలో విద్యార్థినులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. వారిలో మానసిక ఒత్తిడిని గుర్తించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం, సైబర్ నేరాలు, మహిళల భద్రత, చట్టాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాత్రి వేళల్లో మోటివేషన్ క్లాసెస్, ఉదయం యోగా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల్లో మనోధైర్యం, చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పెరుగుతున్న సక్సెస్ రేట్
కేజీబీవీల్లో చదివే విద్యార్థినులు తీవ్ర ఒత్తిడితోపాటు వివిధ రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో మానసిక స్థైర్యం అందించేవారు లేక తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. విద్యాశాఖ ద్వారా అమలు చేసే కార్యక్రమాలు వారిపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. తరచూ ఇండ్లకు వెళ్లిపోయేవారు. ఏడాది క్రితం నుంచి ఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన పోలీస్ అక్కలు ప్రోగ్రాం కేజీబీవీ విద్యార్థినులకు దిక్సూచిలా మారింది. మహిళా పోలీసులు అందిస్తున్న భరోసాతో ప్రస్తుతం విద్యార్థినులు ధైర్యంగా ఉంటున్నారని, విద్యాపరంగా, సామాజికపరమైన కార్యకలాపాల్లో ముందుంటున్నారని పలు కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ప్రోగ్రాం కారణంగా వారి హాజరు, ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.
భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ ప్రోగ్రాం
కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల్లో భద్రతా భావం పెంపొందించేందుకు, వారిలో మానసిక ధైర్యం నింపేందుకు పోలీస్ అక్కలు కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతున్నాం. వారిలో అన్ని రకాల భయాలను తొలగిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతోంది. – జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్