రెక్కల కష్టం వరదపాలు

రెక్కల కష్టం వరదపాలు
  • రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటనష్టం
  • నీళ్ల మధ్యలోనే వందలాది ఊర్లు
  • కొట్టుకుపోయిన బియ్యం, సామాన్లు.. రోడ్డునపడ్డ బాధితులు
  • గోదావరిపై ఎస్సారెస్పీ నుంచి తుపాకులగూడెం దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా
  • కాళేశ్వరం బ్యాక్​ వాటర్​వల్ల  మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 20 వేల ఎకరాలు మునక

నెట్​వర్క్​, వెలుగు: నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు శుక్రవారం కొంచెం గెరువిచ్చినా వరద ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. నిర్మల్, కరీంనగర్​, వరంగల్​ టౌన్లలోని పలు కాలనీల్లో మోకాళ్ల లోతు బురద పేరుకుపోయింది. ఇండ్లలోకి చేరిన వరద నీటిని, బురదను బయటకు పంపించే దారి లేక  లోతట్టు ప్రాంతాల్లోని జనం తిప్పలు పడుతున్నారు. ఇండ్లలోని పప్పు,  బియ్యం, ఇతర సామాన్లు వరదలో కొట్టుకుపోయాయి. అనేక ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ వల్ల పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనే 20 వేల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నిరుడు కూడా బ్యాక్​ వాటర్  నిండా ముంచింది. ఏటా తాము నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో కలెక్టర్​ను ఘెరావ్​ చేశారు. వానలు, వరదల వల్ల ఇతర జిల్లాల్లోనూ భారీగా పంటలు దెబ్బతిన్నాయి. రెక్కల కష్టం వరదపాలవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరద ఉధృతి వల్ల అధికారులు ఎస్సారెస్పీ నుంచి తుపాకులగూడెం వరకు బ్యారేజీల గేట్లన్నింటినీ ఎత్తి నీటిని కిందికి  వదిలేస్తున్నారు. బాసర మొదలుకొని భద్రాద్రి దాకా గోదారి ఉధృతంగా ప్రవహిస్తుండగా, దాని ఉపనదులు ఎదురెక్కుతున్నాయి. 

నిజామాబాద్​లో లక్ష ఎకరాల్లో పంటలు మునక
నిజామాబాద్ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో  పంటలు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోర, సిరికొండ, మోర్తాడ్, కమ్మర్​పల్లి, బోధన్, వర్ని, కోటగిరి మండలాల్లో పంటలు నీటమునిగాయి. కామారెడ్డి జిల్లాలోని  ఎనిమిది మండలాల్లో 18,397 ఎకరాల్లో సోయా, మినుము, పెసర, కంది, వరి తదితర పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.

కరీంనగర్​  అతలాకుతలం
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెరువులు, వాగులు పొంగడంతో పొలాలు దెబ్బతిన్నాయి. సుమారు 1,800 ఎకరాల్లో వరి  నీట మునిగినట్లు అంచనా. శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి, జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాల్లో డ్యామేజీ ఎక్కువగా ఉంది. కరీంనగర్ రూరల్ మండల‍ం ఎలాబోతారం, గోపాలపురం గ్రామ శివారులో నిర్మించిన చెక్ డ్యామ్ వరద ఉధృతికి తెగి పోయింది. కొత్తపల్లి,  వెలిచాల రోడ్డు నీటి  ప్రవాహానికి డ్యామేజ్ అయింది.  కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, నారాయణ రావు పల్లి, గర్రెపల్లి, దుబ్బపల్లి, తొగర్రాయి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్​లో వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. నీరుకుల్లలోని  శ్రీ రంగనాయక స్వామి ఆలయం నీట మునిగింది.  

ఆసిఫాబాద్​లో ఊర్లకు కరెంట్​ కట్
ఆసిఫాబాద్ జిల్లాలో43 వేల ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో వందలాది గ్రామాలకు కరెంట్ సప్లై నిలిచిపోయింది. 48 గంటలుగా  కరెంట్ సరఫరా లేక.. తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి.  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, రామగుండం సీపీ వి.సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​ రావు వరద బాధితులను పరామర్శించారు.  

ఓరుగల్లు కాలనీలు నీళ్లల్లో..!
వరంగల్ అర్బన్ జిల్లాలో  530 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరంగల్ నగరంలో లక్ష్మీగణపతికాలనీ, మధురా నగర్, వివేకానంద కాలనీ, ఎస్సార్​ నగర్​, పద్మా నగర్, సుందరయ్య నగర్​, వీవర్స్​ కాలనీల్లో ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పైనుంచి వస్తున్న వరదకు సిటీలోని భద్రకాళి, వడ్డేపల్లి, చిన్న వడ్డేపల్లి చెరువులు మత్తడి పోస్తుండగా.. నాలాలు జోరుగా ప్రవహిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సిటీలోని నాలాలు, ముంపు ప్రమాదం ఉండే ఏరియాలను పరిశీలించారు. 

భద్రాచలానికి వరద ముప్పు
భద్రాచలం వద్ద గోదావరి వరద ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఫోర్‍  కాస్టును రిలీజ్​ చేసి జిల్లా కలెక్టర్‍కు పంపింది. ముంపు గ్రామాలను అప్రమత్తం చేయాలని, శనివారం ఉదయానికి 43 అడుగుల మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుతుందని అందులో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 25.20 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. అత్యవసర సేవలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‍లో కంట్రోల్‍ రూంను ఏర్పాటు చేశారు. 08744-421950 నెంబర్​కు ఫోన్​ చేయొచ్చు. భద్రాచలం సబ్​ కలెక్టర్​ ఆఫీసులోనూ  కంట్రోల్‍ రూం ఏర్పాటు చేసి 08743-232444 నెంబర్‍ను అందుబాటులో ఉంచారు.