మహాజాతర మొదలవకుండానే మేడారానికి లక్షలాదిమంది జనం

మహాజాతర మొదలవకుండానే మేడారానికి లక్షలాదిమంది జనం

జనమే జనం… మహాజాతర మొదలవకుండానే మేడారానికి ఇప్పటికే లక్షలాదిమంది భక్తుల రాక

ఎల్లుండి నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర
జాతర టైంలో కోటి మందికి పైగా తరలివచ్చే చాన్స్
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆఫీసర్లు
రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు
ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే
భక్తుల కోసం హెలికాప్టర్‌ సేవలు
400 సీసీ కెమెరాలు.. 29 పార్కిం గ్‌ స్థలాల ఏర్పాటు

అన్ని దారులూ మేడారం వైపు కదులుతున్నాయి. వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నెల 5 నుంచి నాలుగురోజుల పాటు సాగే మహాజాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. జాతర టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణంగా ఇప్పటికే లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. జాతర టైంలో కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు మార్మోగుతోంది. భక్తుల కోలాహలంతో అడవి తల్లి పరవశిస్తోంది. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఆదివారం నుంచే ఆర్టీసీ, రైల్వే, హెలీక్యాప్టర్​ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.

 

మేడారం జాతర నాలుగు రోజులే అయినప్పటికీ రెండు, మూడు నెలల పాటు భక్తుల రాకపోకలు ఉంటాయి. రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు ఈసారి నెలన్నర రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. వారం రోజులుగా ఆ సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్‌‌‌‌, ఈ ఏడాది జనవరి నెలలో కలిపి 40 లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖాధికారులు ఆదివారం ప్రకటించారు. మేడారం మహాజాతర‒2020 కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌‌‌‌లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ, ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌, పంచాయతీ రాజ్‌‌‌‌, చిన్ననీటి పారుదల, గిరిజన సంక్షేమ తదితర శాఖల ద్వారా 200కు పైగా పనులు చేపట్టారు. పాత బీటీ రోడ్లకు రిపేర్​ చేయడంతో పాటు కొత్తగా 8 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన మూడు వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లు, 20 వేల మందికి పైగా భక్తులు ఉండేందుకు వీలుగా 5 పెద్ద షెడ్లను నిర్మించారు.చిలుకలగుట్ట వైపు, రెడ్డిగూడెం తదితర జాతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు కూడా పూర్తిచేశారు.

జాతర కోసం ఇప్పటికే 30 వేల మందికి పైగా అధికారులు, ఉద్యోగులు డ్యూటీలో చేరారు. అన్ని ప్రభుత్వ శాఖల హెడ్స్​, తమ క్లస్టర్ల వారీగా ఉద్యోగులను విభజించి బాధ్యతలు అప్పగించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు  ఆర్వీ కర్ణన్‌‌, వెంకటేశ్వర్లు, నోడల్‌ ‌అధికారి వీపీ గౌతమ్‌‌, జేసీ స్వర్ణలత, డీఆర్వో రమాదేవి, ఎస్పీ సంగ్రామ్‌‌సింగ్‌ ‌పాటిల్‌‌, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌‌రావు తదితరులు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్క పోలీస్‌‌శాఖ తరఫున 12 వేలు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి 2 వేలు, పంచాయతీరాజ్‌‌శాఖ శానిటేషన్‌ ‌విభాగం నుంచి 4 వేల మందికి పైగా ఉద్యోగులు డ్యూటీ నిర్వహిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల నుంచి వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాలో పనిచేసే 80 శాతం మందికి పైగా ఉద్యోగులు మేడారంలోనే డ్యూటీ చేస్తున్నారు.

సెక్టోరియల్‌ ఆఫీసర్లకు వాకీటాకీలు

మహాజాతరను విజయవంతం చేయడానికి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి 38 మంది సెక్టోరియల్‌‌ ఆఫీసర్లకు  వాకీ టాకీ లను ఇచ్చారు. వీరిని త్వరగా గుర్తించేందుకుగాను వీరికి కాషాయరంగు దుస్తులను కేటాయించారు. సెల్‌‌ఫోన్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్‌ ‌సరిగా అందకపోతే ఇబ్బంది ఎదురవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్​ చొప్పున ఈ ఆఫీసర్లు 3 షిప్ట్‌‌లలో పనిచేసేలా చూస్తున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా ఇద్దరు ఫీల్డ్ స్థాయిలో, మరో ఇద్దరు ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

కంట్రోల్‌ ‌రూంల ఏర్పాటు

రెవెన్యూ, పోలీస్‌‌శాఖల తరఫున మేడారంలో కంట్రోల్‌‌ రూంలను ఏర్పాటు చేశారు. పస్రా, తాడ్వాయి, చిన్నబోయినపల్లి, నార్లాపూర్‌‌, ఊరట్టం మొదలు కొని మేడారం పరిసర ప్రాంతాలలో ఏ చిన్న సంఘటన జరిగినా తెలియడానికి, ట్రాఫిక్‌ ‌జాం విషయాలు తెలుసుకోవడానికి 400 సీసీ కెమెరాలను అమర్చారు. కేవలం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను బిగించారు. వీటిని ఐటీడీఏ గెస్ట్‌‌హౌజ్‌‌లోని రెవెన్యూ శాఖ, గద్దెల సమీపంలో ఏర్పాటుచేసిన పోలీస్‌‌శాఖ కంట్రోల్‌‌రూంలకు అనుసంధానం చేశారు. ఈ రెండు చోట్ల భారీ స్క్రీన్లను ఏర్పాటుచేసి ప్రతి క్షణం ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నుంచే ఇక్కడ అధికారులను, సిబ్బందిని నియమించి వాకీటాకీలను అందించారు. ఎక్కడైనా భక్తుల రద్దీ పెరిగినా, ఏదైనా అనుకోని సంఘటన జరిగిన వెంటనే అక్కడికి త్వరగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

అమల్లోకి వన్‌‌వే

జాతర జరిగే నాలుగురోజుల్లో కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఆ సమయంలో ట్రాఫిక్‌ ‌జాం కాకుండా పోలీసులు వన్‌‌వే రూల్స్​ఆదివారం నుంచే అమలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ‌వాహనాల్లో భక్తులు జాతరకొచ్చే దారి, వెళ్లిపోయే దారులు వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌‌, రంగారెడ్డి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల‌ నుంచి వచ్చే భక్తులు గుడెప్పాడ్‌‌, పస్రా మీదుగా.. కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, మహారాష్ట్ర ‌రూట్ల నుంచి వచ్చేవాళ్లు గాంధీనగర్‌‌, జంగాలపల్లి క్రాస్‌‌, పస్రా మీదుగా..  చత్తీస్‌గఢ్, మనుగూరు, భద్రాచలం ‌నుంచి వచ్చేవాళ్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చత్తీస్‌‌గఢ్​‌వాళ్లు వచ్చిన దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన అందరూ కూడా మేడారం‒నార్లాపూర్‌ ‌క్రాస్‌‌ మీదుగా కమలాపూర్‌ ‌క్రాస్‌‌రోడ్డు వద్దకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మంచిర్యాలకు వెళ్లేవాళ్లు కుడివైపు.. హైదరాబాద్‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌ వెళ్లేవాళ్లు ఎడమవైపు వచ్చి పరకాలకు చేరుకోవాల్సి ఉంటుంది.  ఇక్కడి నుంచి హైదరాబాద్‌‌కు వెళ్లే వాళ్లు పరకాల నుంచి అంబాల మీదుగా.. మహబూబాబాద్‌‌, ఖమ్మం వైపు వెళ్లేవాళ్లు గుడెప్పాడ్‌, మల్లంపెల్లి మీదుగా ‌క్రాస్‌‌కు వచ్చి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ, వీఐపీ వాహనాలన్నీ తాడ్వాయి మీదుగా మేడారం వెళ్లి రావాలి.

16 చోట్ల సర్కార్​ హెల్త్​ క్యాంపులు

జాతరకు వచ్చే భక్తులకు వైద్య సౌకర్యం అందించడానికి ప్రభుత్వం తరపున 16 చోట్ల ఉచిత హెల్త్​ క్యాంపులు ఏర్పాటుచేశారు. టీటీడీ కల్యాణ మండపంలో తాత్కాలికంగా 50 పడకల హాస్పిటల్​ను అందుబాటులోకి తెచ్చారు. అమ్మవార్ల సన్నిధిలో కాన్పు కోరుకునే గర్భిణుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్‌‌ థియేటర్లను  ఏర్పాటు చేశారు. డాక్టర్లు, ఏఎన్‌‌ఎంలు, పారామెడికల్‌‌ సిబ్బంది కలిపి  రెండు వేల మందికిపైగా ఇక్కడ డ్యూటీ చేయనున్నారు.

7న సీఎం పర్యటన

రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌ మేడారం నుంచే జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం మహాజాతరకు ఈ నెల 7న సీఎం కేసీఆర్​ హాజరుకానున్నట్లు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్​ తెలిపారు. సమ్మక్క, సారలమ్మకు సీఎం మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఆదివారం మంత్రులిద్దరూ మేడారంలోని గిరిజన మ్యూజియంలో కళాప్రదర్శనలు ప్రారంభించారు. అదేవిధంగా స్వచ్ఛమైన మంచినీరు, భక్తులు సేద తీరే షెడ్లను ప్రారంభించారు. మహా జాతర పూర్తయ్యే వరకు మేడారంలోనే ఉంటామని వారు పేర్కొన్నారు.