సింగరేణిపై చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సింగరేణిపై చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సవాల్

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి సింగరేణిపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సవాల్ విసిరారు. సింగరేణి అంటే కాక వెంకటస్వామి గుర్తుకు వస్తారని, ఆయన కార్మికుల పక్షపాతి అని అన్నారు. అప్పుల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. ‘కాకా వారసుడిగా సింగరేణి కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. వారి రుణం తీర్చుకుంటా. సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం పార్లమెంటులో పలుమార్లు గళం విప్పాను. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కచ్చితంగా పెంచాలి. 

అలాగే కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వాలి. మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్లో పోరాడుతానని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సింగరేణి కార్మికులు ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. కార్మికులు సుఖంగా ఉంటేనే సంస్థ బాగుంటుందని అన్నారు. డిపెండెండ్ ఉద్యోగాలు పొందిన సింగరేణి కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై  ఎంక్వైరీ: మంత్రి పొన్నం 

గత పదేండ్లలో సింగరేణిలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయించేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను ఆర్థిక సంపదగానే వాడుకున్నారు తప్ప కార్మికుల సంక్షేమం, కొత్త గనుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పాటు పడలేదని విమర్శించారు. మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ సింగరేణి సంస్థను బీఆర్ఎస్ తమ జేబు సంస్థగా మార్చుకొని ఇష్టారీతిగా వ్యవహరించిందని విమర్శించారు. 12 ఏండ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణలోని సింగరేణి సంస్థకు ఏం చేశారో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పాలన్నారు. 

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ 1992లో సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్ లోకి పోయి మూసివేసే క్రమంలో కాకా వెంకటస్వామి చొరవ తీసుకొని కాపాడారన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల అప్పు ఇప్పించి సింగరేణిని కాపాడిన కార్మిక పక్షపాతి కాకా అని చెప్పారు. ఇయ్యాల సింగరేణి ప్రాణంతో ఉందంటే అది వెంకటస్వామి పుణ్యమే అన్నారు.