వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

పూరి: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘జై జగన్నాథ్’ ‘హరిబోల్’ నామస్మరణతో వీధులు మారుమోగాయి. దేవతామూర్తులను ఊరేగించేందుకు దాదాపు 45 అడుగుల ఎత్తైన నందిఘోష్‌‌‌‌ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్‌‌ (సుభద్ర) రథాలను అందంగా అలకరించారు.

మంగళవారం ఉదయం రథాలపై జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను ప్రతిష్ఠించి మంగళహారతి ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ గణేషి లాల్, సీఎం నవీన్ పట్నాయక్ కలిసి తాడు లాగడంతో రథయాత్ర ప్రారంభమైంది. 

28న తిరిగి పూరీ మందిరానికి విగ్రహాలు

‘పహండి’ సంప్రదాయం ప్రకారం.. మంగళ వాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రథయాత్ర ముందుకు సాగింది. వేలాది మంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు గాయపడ్డారు. సాయంత్రానికి రథాలు గుండిచా మందిరానికి చేరుకున్నాయి. 2 కిలో మీటర్ల పాటు రథయాత్ర కొనసాగింది.

జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు తొమ్మిది రోజులపాటు అక్కడే ఉంటారు. జూన్ 28న తిరిగి పూరీ మందిరానికి చేరుకుంటారు. ఈ రథయాత్రలో పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి పాల్గొన్నారు. జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.