నీట మునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జి

నీట మునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జి

ములుగు: ములుగు జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ములుగు మండలం జంగాలపల్లి వద్ద ములుగు జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరకుంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని జంగాలపల్లి చెరువు మత్తడి దూకితే జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సర్వపురం, జగ్గన్న గూడెం గ్రామాల మధ్య బొగ్గులవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో రెండు గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సులోకి సామర్ధ్యానికి మించి నీరు చేరుకోవడంతో అలుగు పోస్తుంది. రామప్ప బ్యాక్ వాటర్‎తో సమీపాన ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. 

గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామానికి సమీపంలోని దట్టమైన దండకారణ్యంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన లక్నవరం సరస్సు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. భారీగా వరద నీరు వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దాంతో కాటేజీతో పాటు రెస్టారెంట్‎లోకి వరద నీరు చేరింది. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పర్యాటకులను నిలిపివేశారు. అదేవిధంగా మండలంలోని దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కర్లపల్లి శివారు గుండ్లవాగు ప్రాజెక్టు కూడా వర్షాలతో మత్తడి పోస్తోంది. లక్ష్మీపూర్‎లో వర్షాల వల్ల మట్టి గోడలు కూలిపోయాయి.