
‘సర్కారు వారి పాట’ అప్‌డేట్స్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఫస్ట్ సింగిల్ కొవిడ్ కారణంగా రాలేదు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాటను వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ ప్రోమోను నిన్న విడుదల చేశారు. ‘వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినయా, ఏందే ఈ మాయ... ముందో, అటు పక్కో, ఇటు దిక్కో.. చిలిపిగ తీగలు మోగినయా.. పోయిందే సోయ’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. తమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. దుబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో కీర్తి సురేష్ అందాన్ని వర్ణిస్తూ మహేష్ బాబు పాడే పాట ఇది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబుతో కలిసి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న మూవీ రిలీజ్ కానుంది.