కుమమోటో: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ లక్ష్య 21–13, 21–11తో జియా హెంగ్ జాసన్ (సింగపూర్)పై గెలిచాడు. 39 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ర్యాలీలు, స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. 8–5తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన లక్ష్య 10–9తో ముందుకెళ్లాడు.
14–13 వద్ద వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఎండ్‌లు మారిన తర్వాత లక్ష్య మరింత దూకుడుగా ఆడాడు. 5–0, 11–3తో దూసుకుపోయాడు. మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 18–21, 15–21తో రాస్మస్ గిమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడాడు. 46 నిమిషాల మ్యాచ్‌లో ప్రణయ్ పోరాటం చేసినా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు.
