జపాన్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌ బోణీ

జపాన్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌ బోణీ

కుమామోటో (జపాన్‌‌‌‌): ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌.. కుమామోటో జపాన్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో బోణీ చేశాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌ లక్ష్య 21–12, 21–16తో వరల్డ్‌‌‌‌ 26వ ర్యాంకర్‌‌‌‌ కొకి వటనాబే (జపాన్‌‌‌‌)పై గెలిచాడు. 39 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ స్మాష్‌‌‌‌లు, ర్యాలీలతో చెలరేగాడు. దీంతో తొలి గేమ్‌‌‌‌లో ప్రత్యర్థికి ఎక్కడా స్కోరు సమం చేసే చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. 

అయితే రెండో గేమ్‌‌‌‌లో 1–7తో వెనకబడిన లక్ష్య తర్వాత క్రాస్‌‌‌‌ కోర్టు విన్నర్లతో వరుసగా పాయింట్లు సాధించాడు.  ఫలితంగా 15–15, 16–16 వరకు గేమ్‌‌‌‌ హోరాహోరీగా సాగింది. ఈ దశలో లక్ష్య వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌లో హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌ 16–21, 21–13, 23–21తో జున్‌‌‌‌ హో లియోంగ్‌‌‌‌ (మలేసియా)పై గెలవగా, ఆయుష్‌‌‌‌ షెట్టి 16–21, 11–21 కొడాయ్‌‌‌‌ నరోకా (జపాన్‌‌‌‌) చేతిలో, కిరణ్‌‌‌‌ జార్జ్‌‌‌‌ 20–22, 10–21తో జింగ్‌‌‌‌ హాంగ్‌‌‌‌ కోక్‌‌‌‌ (మలేసియా) చేతిలో, తరుణ్‌‌‌‌ మానెపల్లి 9–21, 19–21తో జిన్‌‌‌‌ జియోన్‌‌‌‌ హోయెక్‌‌‌‌ (కొరియా) చేతిలో ఓడారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌–రుత్వికా శివాని 12–21, 21–19, 20–22తో ప్రెస్లీ స్మిత్‌‌‌‌–జెన్నీ గాయ్‌‌‌‌ (అమెరికా) చేతిలో కంగుతిన్నారు.