బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని పంపించారు. మీరందరూ తన కోసం ప్రార్థించారని, తాను బాగున్నానని తెలియజేశారు. సింగపూర్ లో స్థిరపడ్డి ఆయన కూతురు రోహిణి ఆచార్య ఇటీవలే కిడ్నీ దానం చేశారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలిస్తున్న వీడియో ట్వీట్ చేసిన ఆయన.. తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కిడ్నీ ఇచ్చిన తన అక్కతో పాటు తమ జాతీయ అధ్యక్షుడు (లాలూ) క్షేమంగా ఉన్నారని చెప్పారు. వారి క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని తేజస్వి అన్నారు. ఇక లాలూ శస్త్రచికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేశారు. పాట్నాలోని ఆలయాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

