
ఈ నెల 9న జనగామ మండలం మరిగడిలో భూమి కోసం ఓ వ్యక్తి తన తల్లిని నరికి చంపాడు. గ్రామానికి చెందిన రమణమ్మకు10 ఎకరాల భూమి ఉంది. గతంలో నాలుగు ఎకరాలు కూతురికి రాసివ్వగా.. మిగిలిన ఆరెకరాలను తన పేరిట పట్టా చేయాలని కొడుకు కన్నప్ప పట్టుబట్టాడు. కానీ కొడుకు తీరు వల్ల తల్లి నిరాకరించడంతో కత్తితో ఆమెపై దాడి చేసి తల, మొండెం వేరు చేశాడు.
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో ఏడాది కాలంలో 800కు పైగా మర్డర్లు జరిగితే ఇందులో మూడోవంతు హత్యలకు భూవివాదాలే కారణమని పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే 20 మంది ల్యాండ్ ఇష్యూస్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఐటీ, మెడికల్‌హబ్‌గా మారిన హైదరాబాద్‌లో మొదలైన రియల్ ఎస్టేట్‌బూమ్ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రమంతా విస్తరించింది. దీనికి సర్కారు చర్యలు తోడై వ్యవసాయ భూముల రేట్లకూ రెక్కలొచ్చాయి.రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోని భూములు.. ఎకరా రూ.2 కోట్ల వరకు, ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాలోనూ రూ. 30 లక్షలకు పైగా పలుకుతున్నాయి. దీంతో భూముల కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు.ఓవైపు రాజకీయ అండదండలతో రియల్ఎస్టేట్ మాఫియా తుపాకులతో ల్యాండ్ సెటిల్మెంట్లకు తెగబడుతుండగా.. సామాన్యులు కూడా భూముల కోసం తల్లిదండ్రులను, తోడబుట్టినోళ్లను చంపేందుకూ వెనుకాడటం లేదు.
ఐనోళ్లను పొట్టనపెట్టుకుంటున్నరు
రాష్ట్రంలో ఎకరా భూమి ఉంటే చేతిలో రూ.50 లక్షల నుంచి కోటి ఉన్నట్లే. అందుకే గుంట జాగ కూడా వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడ్తలేరు. అవసరమైతే తల్లిదండ్రులను, తోడబుట్టిన అన్నదమ్ములను, కలిసి తిరిగే దోస్తులను కూడా చంపుతున్నారు. ఇందుకోసం లక్షల్లో సుపారీ ఇస్తున్నారు.
- గత నెల 17న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ మండలం కమ్మర్గం గ్రామానికి చెందిన దుర్గం తుకారాం భూమి కోసం సొంత పెద్దనాన్న కూతురిని సుఫారీ గ్యాంగ్‌తో హత్యచేయించాడు. గతంలో తుకారాం పెద్దనాన్న దుర్గం లింగయ్య ఆసుపత్రి పాలయ్యాడు. తన 5 ఎకరాల భూమిలోంచి రెండున్నర ఎకరాలు ఇస్తానని చెప్పడంతో హాస్పిటల్ఖర్చంతా తుకారాం భరించాడు. కానీ, లింగయ్య చనిపోగానే ఆయన భార్య, కూతురు మాటమార్చారు. మొత్తం భూమిని తమ పేరుతో పట్టా చేసుకోవడంతో కక్ష పెంచుకున్న తుకారాం సుపారీ గ్యాంగ్‌తో చెల్లెలిని హత్య చేయించాడు.
- జనవరి 22న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లికి చెందిన సింగిరెడ్డి జ్యోతిని ఆమె భర్త ఎల్లారెడ్డి హత్య చేశాడు. భూమి అమ్మే విషయంలో భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి, కోపోద్రిక్తుడైన ఎల్లారెడ్డి.. జ్యోతిని చంపి పారిపోయాడు.
- జనవరి 17న సూర్యాపేట మండల బాలేంల గ్రామంలో భూమి హద్దుల పంచాయతీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. గ్రామానికి చెందిన ఉప్పుల లింగయ్య (36), అతని పెదనాన్న కొడుకు ఉప్పుల సతీశ్‌కు పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా వీరి మధ్య గెట్ల పంచాయితీలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తమ్ముడు లింగయ్యపై సతీశ్ గొడ్డలితో దాడి చేయగా, స్పాట్లోనే చనిపోయాడు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌లో భూతగాదాల వల్ల రెండు ప్రాణాలు గాల్లో కలిశాయి. గొల్లపల్లి లింగవ్వ(50) అనే మహిళ ను డిసెంబర్ 26 న బంధువులే బండరాయితో కొట్టి చంపారు. తన తల్లి చావుకు గొల్లపల్లి శంకర్(47) కారణమని ఆరోపిస్తూ వచ్చిన లింగవ్వ కొడుకు మధుసాగర్.. జనవరి 21న ముగ్గురు స్నేహితులతో కలిసి నడిరోడ్డుపై శంకర్‌ను పొడిచి చంపారు.
- నల్గొండ జిల్లా డిండి మండలం జేత్యా తండాలో ఫిబ్రవరి 13న రమావత్ గన్యా(65) అనే వ్యక్తిని తెలిసిన వ్యక్తులే భూ వివాదం వల్ల హత్య చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- జనవరి 8న సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మోదిన్ పురంలో భూమి కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో వెంకటమ్మ ( 67) అనే మహిళ చనిపోయింది. 20 ఏండ్ల కింద కాకి రామిరెడ్డి అనే వ్యక్తికి అమ్మిన భూమి విషయంలో ధారావత్ శత్రు కుటుంబీకులకు, కాకి అంజిరెడ్డి కుటుంబీకులకు గొడవలు జరుగుతున్నాయి. జనవరి 8న శత్రు కుటుంబీకులు శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు సుధాకర్, రామస్వామి, వెంకటమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాస్ తల్లి వెంకటమ్మ చనిపోయింది.
- జనవరి 3న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో జరిగిన భూతగాదాలో రైతు జంగిలి పెద్ద రాజు (39) హత్యకు గురయ్యాడు. ఈయన భూమి పక్కనే ఉన్న దాసరి మార్కండేయతో కొన్నేండ్లుగా హద్దుల పంచాయితీ ఉంది. ఇది ఘర్షణకు దారి తీయడంతో మార్కండేయ పారతో రాజుపై దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయాడు.
- డిసెంబర్ 27న గద్వాల మండలం చెనుగోనిపల్లిలో భూమి కోసం నాన్నమ్మ నబీసాబ్ను మనుమడు శాలుబాస గొంతు కోసి చంపాడు.
- డిసెంబర్ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టి మల్లేశం(43) హత్యకు గురయ్యాడు. చేర్యాల మండలం గురిజకుంటలో మల్లేశంపై కత్తులతో, గొడ్డళ్లతో దాడి చేసి చంపారు. భూ వివాదాలనే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- డిసెంబర్ 19న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని దోమలకుంటలో భూమి కోసం నక్క గంగవ్వ(45)ను ఆమె భర్త రమేశ్ పథకం ప్రకారం హత్య చేశాడు. కొన్నేండ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా.. తన భూమిలో కి రావద్దని భార్యకు రమేశ్ వార్నింగ్ఇచ్చాడు. ఆమె వినకపోవడంతో నారుమడిలోనే నరికి చంపాడు.
- వికారాబాద్ జిల్లా దోమ మండలం కొండాయిపల్లికి చెందిన నెత్తి బాలరాజు, నెత్తి నర్సింహులు(40) అన్నదమ్ములు. ఇటీవల తల్లిదండ్రులకు చెందిన 13 గుంటల భూమి అమ్మారు. వచ్చిన డబ్బులు విషయమై గొడవపడ్డారు. బాలరాజు, అతని భార్య, కొడుకు ముగ్గురు కలిసి నర్సింహులు ఇంటికి వెళ్లి, నిద్రపోతున్న అతడిపై రోకలి బండతో దాడి చేసి చంపారు.
- నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పార్ పెల్లిలో శివరాత్రి మహేశ్(32)ను నవంబర్ 24న హత్య చేశారు. మహేశ్ ఇంటి జాగా వెనక కుంచెపు సాయన్న ఇల్లు ఉంది. తన ఇంటికి దారి ఇవ్వాలని సాయన్న వేడుకోగా, మహేశ్ దారికి అడ్డంగా కంచె వేశాడు. గొడవ ముదిరి సాయన్న, అతని కొడుకు, మరో వ్యక్తితో కలిసి మహేశ్‌ను చంపేశారు.
- హైదరాబాద్ ఉప్పల్‌లోని హనుమాన్ సాయి కాలనీలో అక్టోబర్14న పూజారి నర్సింహుల నర్సింహమూర్తి (78) , ఆయన కొడుకు శ్రీనివాస్‌రావును దుండగులు హత్య చేశారు. ఉదయం 5:45కు ఇంట్లోకి చొరబడి కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హత్యలకు నర్సింహమూర్తి, ఆయన తమ్ముడు, చెల్లెలు మధ్య కొంత కాలంగా ల్యాండ్ఇష్యూసే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
- ఫతేదర్వాజలో గతేడాది డిసెంబర్ 20న జరిగిన బాసిత్అలీ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కామాటిపురా పోలీసుల విచారణలో.. 500 గజాల జాగ, ఇల్లు కోసమే అతని చిన్నమ్మ షాకిరా బేగం (39), తన ప్రియుడు జియాగూడకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్‌తో కలిసి చంపినట్లు తేలింది.
రెచ్చిపోతున్న రియల్ మాఫియా..
భూముల రేట్లు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా సెటిల్మెంట్లు చేసే గ్యాంగులు, గన్‌కల్చర్ పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వివాదాలతో 2022 మార్చి 1న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌రెడ్డి , రాఘవేందర్‌రెడ్డితో ప్రధాన నిందితుడైన మెరెడ్డి మట్టారెడ్డి అలియాస్ అశోక్‌రెడ్డికి భూ తగాదాలున్నాయి. చర్ల పటేల్‌గూడెంలోని 15 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాల వల్లే మట్టారెడ్డి జంట హత్యలు చేయించాడని పోలీసులు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలో భూముల రేట్లు పెరగడం వల్లే రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి లిటిగేషన్ భూములను కొనడం, సెటిల్మెంట్లు చేయడం పనిగా పెట్టుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఎల్బీనగర్లో చోటా నయీం పేరుతో భూదందాలు, రియల్ఎస్టేట్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ తరహా సెటిల్మెంట్లు ఇటీవల వరంగల్లోనూ మొదలైంది. గతంలో నయీమ్ గ్యాంగ్‌లో పని చేసిన ముద్దసాని వేణుగోపాల్, ఆయన బంధువు, ములుగులో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సంపత్ కుమార్, భూపాలపల్లి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీపీ, వరంగల్ చుట్టుపక్కల ఉన్న కోట్ల విలువైన వివాదాస్పద భూముల మీద కన్నేశారు. బాధితులను బెదిరిస్తూ వాటిని స్వాధీనం చేసుకుని అమ్ముకోవడం ప్రారంభించారు. నిరుడు జులైలో వరంగల్– -భూపాలపట్నం హైవేకు సమీపంలో ఆరెపల్లి వద్ద బాధితుడిని తుపాకీతో బెదిరించి రూ.కోట్ల విలువైన భూమిని దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ల్యాండ్ రేట్లకు రెక్కలు
గతంలో భూమి రేటును అందులో పండే పంటను బట్టి నిర్ణయించేవారు. నీటి వసతి, నేల రకాన్ని బట్టి ధర పెట్టేవారు. కానీ రాష్ట్రంలో కొంతకాలంగా భూముల రేట్లను పంటలు, వాటిని పండించే రైతులు కాకుండా బడా లీడర్లు, రియల్టర్లు నిర్ణయిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఐటీ, ఫార్మా కారణంగా ఉపాధి అవకాశాలకు హైదరాబాద్ స్వర్గసీమగా మారింది. దీంతో అప్పట్లోనే హెచ్ఎండీఏ పరిధిలో రియల్ఎస్టేట్ మంచి ఊపు మీద ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుంజుకున్నది. గత నాలుగైదేండ్లుగా పొలిటికల్ లీడర్లు, వ్యాపారులు, ఆదాయం ఎక్కువగా ఉండే ఇతర వర్గాలు తమ దగ్గర ఉన్న బ్లాక్‌మనీని భూమి మీద పెట్టుబడులుగా పెట్డడం పెరిగింది. మిడిల్‌క్లాస్ ప్రజలు కూడా ప్లాట్లు, ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపడంతో రియల్ఎస్టేట్ బూమ్ పెరిగింది. రైతు బంధు, రీజనల్ రింగ్ రోడ్డు లాంటి ప్రాజెక్టులు అగ్రికల్చర్ భూమి విలువ పెరగడానికి కారణమయ్యాయి. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో దళితులు, పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కోవడం, పోడు భూముల్లోంచి గిరిజన, గిరిజనేతర రైతులను వెళ్లగొట్టడం, కొత్త పాస్‌బుక్ లలో ‘కాస్తు కాలమ్’ఎత్తేసి పట్టా ఉంటేనే, అదీ ధరణిలోకి ఎక్కినదే భూమి అన్నట్లుగా ప్రచారం చేయడం.. లాంటి చర్యలతో పట్టా భూములకు డిమాండ్, దానితోపాటే రేట్లు పెరిగిపోయాయి. ‘‘తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా.. మన భూముల విలువ రూ.30 లక్షలకు తక్కువ లేదు” అంటూ ఏడాది క్రితం సీఎం కేసీఆర్ చెప్పినట్లే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూములు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పలుకుతున్నాయి. స్టేట్, నేషనల్ హైవేల వెంట ఎక్కడా ఎకరం భూమి రూ.కోటికి తక్కువ లేదు.