- 200 కేస్ స్టడీలతో అక్రమాల చిట్టా బట్టబయలు చేస్తం
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: 22-ఏ నిషేధిత భూముల అక్రమాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తుందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. భూ కబ్జాలు, కుంభకోణాలపై తమ వద్ద 200 కేస్ స్టడీలు, పక్కా ఆధారాలు ఉన్నాయని, ఈ నెల10న ‘ల్యాండ్ హీస్ట్ సిరీస్ పార్ట్-2’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ఇందులో 10 నుంచి 15 కీలక అక్రమాను కూడా ప్రజల ముందుంచుతామని వెల్లడించారు.
మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మహేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం అవినీతి చిట్టాలను విప్పుకుంటున్నాయని, కేటీఆర్ దోచుకున్న ఆస్తులను రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి దోచుకున్న ఆస్తులను కేటీఆర్ బయటపెడుతున్నారని చెప్పారు. అయితే వారు బయటపెట్టుకుంటున్నది కేవలం ఒక్క శాతం మాత్రమేనని, మిగిలిన 99 శాతం దోపిడీని తాము ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని వెల్లడించారు.
మెమోలతో మభ్యపెట్టొద్దు
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22ఏ నిషేధిత జాబితా పేరుతో చేసిన అక్రమాలను బీజేపీ ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిందని ఏలేటి చెప్పారు. దాదాపు 23 లక్షల ఎకరాలు, 13 వేల లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ శాఖ మంత్రి సైతం అసెంబ్లీలో ఒప్పుకున్నారని, కానీ ఇప్పటివరకు ఫోరెన్సిక్ నివేదికను, పూర్తి వివరాలను ప్రజల ముందు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 22-ఏ సమస్యకు కొన్ని భూములకు మెమోలు జారీ చేయడం శాశ్వత పరిష్కారం కాదన్నారు. మెమోలతో మోసం చేయొద్దని, కమిటీలు వేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదని అన్నారు.
కూకట్‌పల్లిలో రూ.50 వేల కోట్ల భూ కుంభకోణం
రాష్ట్ర నలుమూలల నుంచి భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ ఏకంగా 30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఏలేటి ఆరోపించారు. కూకట్‌పల్లిలో రూ.50వేల కోట్ల విలువైన 286 ఎకరాల భారీ భూ దందా వెలుగులోకి వచ్చిందన్నారు. 10న భూ కుంభకోణాల బాగోతాన్ని బహిర్గతం చేశాక, పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
