
- రాయితీ ఇచ్చినా ముందుకురాని దరఖాస్తుదారులు
- జిల్లావ్యాప్తంగా 20,499 అప్లికేషన్లకు 5,015 మాత్రమే పరిష్కారం
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎల్ఆర్ఎస్ ద్వారా రూ. 11.79 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం రాయితీ ఇచ్చినప్పటికీ కొందరు దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో 5,015 అప్లికేషన్లు పరిష్కారమయ్యాయి. అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం 2020లో దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో రూ. వెయ్యి చెల్లించి అప్లయ్ చేసుకున్నారు. ఆ తర్వాత పక్రియ కోసం ప్రభుత్వం అవకాశాలు కల్పించింది.
రెగ్యులరైజ్ చేసుకునేందుకు అమౌంట్ ఎక్కువ అవుతుందని భావించి దరఖాస్తులుదారులు ఆసక్తి చూపలేదు. ఇటీవల ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం 25 శాతం రాయితీ ఇచ్చింది. మొదట మార్చి 31 వరకు ఉండగా, దీన్ని ఏప్రిల్ చివరి వరకు, ఆ తర్వాత ఈ నెల 3 వరకు అవకాశం కల్పించింది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసినా ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు అంతగా ముందుకు రాలేదు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 20,499 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 5,015 ( 25 శాతం) పరిష్కారమయ్యాయి. ఇంకా 15,484 మంది దరఖాస్తుదారులు ముందుకు రాలేదు.
మున్సిపాలిటీల వారీగా..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 17,686 అప్లికేషన్లు వస్తే ఇందులో 4,450 మంది మాత్రమే అమౌంట్ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారు. దీంతో రూ. 10.57 కోట్ల ఆదాయం సమకూరింది. బాన్సువాడలో 1,903 అప్లికేషన్లలో 332 మంది అమౌంట్ చెల్లించగా, రూ. 85 లక్షలు ఆదాయం వచ్చింది. ఎల్లారెడ్డిలో 910 అప్లికేషన్లలో 293 మంది డబ్బులు చెల్లించగా, రూ. 37 లక్షల ఆదాయం సమకూరింది.