బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో 24 లక్షల ఎకరాల భూకుంభకోణం

బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో 24 లక్షల ఎకరాల భూకుంభకోణం
  •    ధరణిలో భూములను నిషేధిత జాబితాలో పెట్టి దోచుకున్నరు: కోదండ రెడ్డి
  •     అన్నీ ఆధారాలిస్తా.. కేసీఆర్, కేటీఆర్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని సర్కార్‌‌‌‌కు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందని కిసాన్​ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. ఆ తర్వాత వారికి కావాల్సినోళ్లకు కట్టబెట్టారన్నారు. కుట్రపూరితంగానే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి, భూకుంభకోణానికి తెరతీశారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ కేసీఆర్ దగ్గర, ఐటీ శాఖ కేటీఆర్ దగ్గర ఉన్నాయని, అవకతవకలకు ధరణి కుంభకోణానికి వాళ్లిద్దరే బాధ్యులని చెప్పారు.

శనివారం గాంధీ భవన్‌‌లో కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శామీర్‌‌‌‌పేట మండలంలోని తూముకుంటలో సర్వే నంబర్‌‌‌‌ 164/1లో 26 ఎకరాల అటవీ భూమిని 2 022 జూన్‌‌లో తెలిసివాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. సర్వే నంబర్​ 260/2, 261, 265/8, 361/7, 361/9లోని డిఫెన్స్ ల్యాండ్‌‌ని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు కట్టబెట్టారని పేర్కొన్నారు. ‘‘బోంరాస్‌‌పేటలో 1,065 ఎకరాల ప్రైవేట్ భూమి అసలైన రైతులకు దక్కకుండా సంతోష్ కుటుంబానికి చెందిన ‘F4L farms’కు ధారాదత్తం చేశారు. 23 ఎకరాల నిషేధిత భూమిని ఎంపీ సంతోష్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వేల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి.. ఎన్నికలవ్వగానే అంబూజ్ అగర్వాల్‌‌కు రిజిస్ట్రేషన్ చేశారు. హెచ్‌‌ఎండీఏని అడ్డుపెట్టుకొని పేదల భూమిని లాక్కుని వేలం వేశారు. చేవెళ్ల మండలం చందవెల్లిలో 1,500 ఎకరాలను దళితుల దగ్గర్నుంచి బలవంతంగా తీసుకొని ఎకరాకు రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. కేటీఆర్ మాత్రం తనకు అనుకూలంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీకి ఎకరాకు రూ.1.3 కోట్లకు అమ్ముకున్నారు’’అని ఆరోపించారు. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

ధరణి అనేది భూములు కాజేయడానికేనని సర్వే ఆఫ్ ఇండియా అధికారి ఒకరు చెప్పారని కోదండ రెడ్డి అన్నారు. అప్పటి సీఎస్ సోమేశ్‌‌ కుమార్ భూకుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ అక్రమాలపై ప్రభుత్వానికి అన్ని ఆధారాలతో నివేదిక ఇస్తానని, వాటి ఆధారంగా లోక్‌‌సభ ఎన్నికలు అయ్యాక కేసీఆర్, కేటీఆర్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతటి పెద్దోళ్లున్నా వదలొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.