ఎల్ అండ్ టీకి సెయిల్ భారీ ఆర్డర్

ఎల్ అండ్ టీకి సెయిల్ భారీ ఆర్డర్

న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన మినరల్స్ అండ్ మెటల్స్ విభాగం మేజర్​ ఆర్డర్లను దక్కించుకుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నుంచి దేశీయ మెటల్ రంగంలో ప్రాజెక్టుల కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. ఎల్ అండ్ టీ లెక్కల ప్రకారం మేజర్ ఆర్డర్లు అంటే రూ.ఐదు వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మధ్యలో ఉంటాయి. 

పశ్చిమ బెంగాల్ లోని ఇస్కో స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 2.5 మిలియన్ టన్స్​ పర్ ఆనమ్ (ఎంటీపీఏ) నుంచి 6.5 ఎంటీపీఏకు పెంచే విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆర్డర్ లభించింది. ఇందులో కోక్ ఓవెన్ బ్యాటరీ, బై ప్రొడక్ట్ ప్లాంట్ వంటి కీలక విభాగాల నిర్మాణం ఉంటుంది. ఝార్ఖండ్ లోని బొకారో స్టీల్ ప్లాంట్ లో సింటర్ ప్లాంట్– 2 ఏర్పాటు బాధ్యత కూడా ఎల్ అండ్ టీ కి దక్కింది. క్లిష్టమైన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో తమకున్న నైపుణ్యానికి ఈ ఆర్డర్లు నిదర్శనమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.