- టెండర్ల ప్రకియ పూర్తి , త్వరలో పనులు
- నిర్మాణం పూర్తయితే సిటీలో ఇదే అతిపెద్దది
- రూ.4,263 కోట్లతో ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మాణం
- మొత్తం 18.15 కి.మీ ప్రాజెక్టులో 11.52 కి.మీ. మేర స్టీల్ బ్రిడ్జి
- ఆ తర్వాత హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మించారు. త్వరలో హెచ్ఎండీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్– 2 ను స్టీల్ బ్రిడ్జిగానే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇది పూర్తయితే నగరంలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జిగా నిలవనుంది. హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి డెయిరీ ఫామ్ వరకు 5.18 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్– 1 నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండో ఎలివేటెడ్ కారిడార్–-2ను త్వరలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
192 ఎకరాల భూసేకరణ
ఎలివేటెడ్ కారిడార్–2 నిర్మాణానికి 9.35 కి.మీ. పరిధిలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములు, మరో 8.35 కి.మీ. పరిధిలో 78.39 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 967 నిర్మాణాలను తొలగించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూంకుంట మీదుగా శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.
ఈ ఫ్లైఓవర్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఓఆర్‌ఆర్ వరకు, అక్కడి నుంచి రాజీవ్ రహదారికి రాకపోకలు సులభం అవుతాయి. ప్రస్తుతం ఈ రూట్‌లో రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మిస్తోంది. భూసేకరణ కసరత్తు ఇప్పటికే పూర్తి చేశారు.
మరో రెండు నెలల్లో పనులు
ప్రస్తుతం ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన (రెండున్నరేండ్లలో) పూర్తి చేశారు. అలాగే ఎలివేటెడ్ కారిడార్‌ను మూడేండ్లలో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్-1 ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి డెయిరీఫామ్ (5.18 కి.మీ.) వరకు నిర్మిస్తారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభమయ్యాయి.
దీన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయించారు.ఈ రూట్‌లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రూట్‌లో బోయిన్‌పల్లి, జీడిమెట్ల, కొంపల్లి వద్ద ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఎన్‌హెచ్-44 రూట్‌లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని అధికారులు తెలిపారు.
తిరుమలగిరి, అల్వాల్ వద్ద ఎగ్జిట్, ఎంట్రీలు
ఎలివేటెడ్ కారిడార్– 2ను ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ను కలుపుతూ నిర్మిస్తారు. మధ్యలో తిరుమలగిరి, అల్వాల్ వద్ద ఎగ్జిట్, ఎంట్రీలు నిర్మించి ఈ ప్రాంతాల నుంచి నేరుగా ఎలివేటెడ్పైకి ఎక్కే అవకాశం కల్పిస్తారు. మొత్తం 18.15 కి.మీ. మేర నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్‌లో 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జిగానూ, హకీంపేట ఎయిర్‌ఫోర్స్ నుంచి 6 కి.మీ. 6 లేన్స్ టన్నెల్‌ను నిర్మిస్తారు. హకీంపేటలో ఎయిర్‌పోర్ట్ ఉండడం వల్ల ఎలివేటెడ్‌కు రక్షణశాఖ అనుమతి నిరాకరించడంతో అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.4,263 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు.
