ట్యాంక్ బండ్ పై లేజర్ షో

ట్యాంక్ బండ్ పై లేజర్ షో

హైదరాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై లేజర్ సొబగులు రానున్నాయి. ఇప్పటికే వీకెండ్ లో ట్యాంక్ బండ్ పై వెహికల్స్ రాకపోకలపై ఆంక్షలు విధించి పర్యాటకులను ప్రోత్సహిస్తుండగా... రానున్న రోజుల్లో పర్యాటక రంగానికి వీలుగా హెచ్ఎండీఏ అభివృద్ధి పనులు చేపట్టనుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికల్స్  రాకపోకలను నిలిపేయడంతో క్రమంగా సందర్శకుల తాకిడి పెరుగుతోంది.  ఇప్పటికే ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేప్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో సందర్శకుల కోసం ట్యాంక్ బండ్ పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దాలని.. లేజర్‌‌‌‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని  మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ కమిషనర్​ను ఆదేశించారు.  అన్ని వైపులా నుంచి వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. హస్తకళలు, సంగీతం, ఇతర కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. దీనిపై స్పందించిన హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌.. అందుకు అనుగుణంగా పనులు చేపడతామన్నారు. లుంబినీ పార్కు, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్లే  రోడ్లన్నీ ఆదివారం జనాలతో సందడిగా మారుతున్నాయి.  మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తొందరలోనే మరిన్ని బ్యూటిఫికేషన్, టూరిజం స్పాట్లను అభివృద్ధి చేయనున్నట్లుగా హెచ్ఎండీఏ వర్గాలు తెలిపాయి.