సీటు బెల్టు పెట్టుకుంటే బతికేది: కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి

సీటు బెల్టు పెట్టుకుంటే బతికేది: కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి
  • లాస్య నందిత మరణం బాధాకరం

హైదరాబాద్, పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్‌‌‌‌ మార్చురీకి వచ్చిన ఆయన.. లాస్య మృతదేహం వద్ద నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది నెలల్లోనే ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలకు నందిత ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే కూతురు లాస్య మరణించడం విచారకరమన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో లాస్య ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించేదని గుర్తుచేశారు. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారని మంత్రి వెల్లడించారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే లాస్యకు ప్రాణాపాయం తప్పేదేమోనన్నారు. ఇటీవల ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌‌‌‌ కుమార్ కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు. కారులో వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఆమె ఆత్మశాంతి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మంత్రి వెంట మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. 

తీవ్ర గాయాలతోనే మరణం

లాస్య తలకు తీవ్ర గాయాలయ్యాయని పోస్ట్‌‌‌‌మార్టం చేసిన డాక్టర్లు తెలిపారు. ఆమె ఎడమకాలి ఫీమర్ బోన్ తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. దవడ భాగం చిట్లిందని, కొన్ని దంతాలు విరిగిపోయాయని చెప్పారు. దవడ ఎముకతో పాటు ఛాతీ ఎముకలు కూడా విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. మల్టీపుల్‌‌‌‌ ఫ్యాక్చర్స్‌‌‌‌ వల్లే ఆమె మరణించినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు.