- ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల బంద్
- తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో శ్రీశైలానికి మాత్రం భారీగా వరద
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మొన్నటిదాకా ఎగువన కురిసిన భారీ వర్షాలతో బేసిన్లో వరద రాగా.. ఇప్పుడు వానలు తగ్గిపోవడంతో వరద కూడా పడిపోయింది. మొన్నటిదాకా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు 3 లక్షల క్యూసెక్కుల దాకా ఇన్‌ఫ్లోస్ రాగా.. ఇప్పుడు అది 50 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఆల్మట్టికి 56 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 15 వేల క్యూసెక్కులనే కిందకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 20 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే 6 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టుకు మాత్రం వరద కొనసాగుతున్నది. తుంగభద్ర ప్రాజెక్ట్ డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో.. ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. డ్యామ్‌లోని 60 టీఎంసీలను ఖాళీ చేస్తే తప్ప కొత్త గేటు బిగించే పరిస్థితి లేకపోవడంతో వరదను వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. ఔట్ ఫ్లో 2.84 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టుకు 1.86 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 1.04 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
గోదావరి బేసిన్లోనూ తగ్గుముఖం
గోదావరి బేసిన్లోనూ వరద భారీగా తగ్గుముఖం పట్టింది. ఓ దశలో 12 లక్షల క్యూసెక్కుల వరద.. భద్రాచలం నుంచి దిగువకు వెళ్లిపోగా.. ప్రస్తుతం 4.35 లక్షల క్యూసెక్కులు మాత్రమే భద్రాచలం నుంచి ఔట్ ఫ్లో అవుతున్నది. మేడిగడ్డ వద్ద 2.89 లక్షలు, సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద 4.39 లక్షలు, సీతమ్మసాగర్ బ్యారేజీ వద్ద 4.61 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద కిందకు వెళ్లిపోతున్నది.
