గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రూ.1.84 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర స్థాయి వన మహోత్సవ్–2026 సందర్భంగా నర్సంపేట రేంజ్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో సందర్శకుల సౌకర్యాల కోసం సఫారీ వాహనాలు, పెడల్ బోటింగ్ పూల్, పర్యావరణ విద్యా కేంద్రం భవనం, డార్మెటరీ హాల్, నైట్ క్యాంపింగ్ ప్రాంతం, ఆర్‌వో ప్లాంట్, సీసీ రోడ్లు తదితర పనులను రూ.153.95 లక్షల వ్యయంతో పూర్తి చేశారు.
అలాగే వరంగల్ జిల్లా అటవీ కార్యాలయ భవనంలో రూ.30 లక్షలతో ఆధునికీకరణ, పునరుద్ధరణ పనులు చేపట్టారు. మొత్తం రూ.183.95 లక్షల విలువైన ఈ పనులు ఎకో టూరిజం ప్రోత్సాహం, పర్యావరణ విద్య విస్తరణ, అటవీ శాఖ మౌలిక వసతుల బలోపేతానికి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట: వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పాకాల అభయారణ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీశాఖ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.
అనంతరం పిల్లల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ కొలనులో బోటు విహారం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్, డీఎఫ్‌వో నిఖిల, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
