‘మద్దతు’పై చట్టం తేవాలె : కిసాన్ గర్జన ర్యాలీలో రైతుల డిమాండ్

‘మద్దతు’పై చట్టం తేవాలె : కిసాన్ గర్జన ర్యాలీలో రైతుల డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధరను చట్టం చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్​సంఘ్(బీకేఎస్) నేతృత్వంలో రామ్​లీలా మైదానంలో ‘కిసాన్ గర్జన ర్యాలీ’ పేరిట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది రైతులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని నినాదాలు చేశారు. బీకేఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ, కిసాన్ గర్జన ర్యాలీ కో ఆర్డినేటర్ కొండెల సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 

ఇన్​పుట్ ధర ఆధారంగా రైతులు పండించే పంటలకు లాభసాటి ధరలు నిర్ణయించి, ఆ ధరపై చట్టం తేవాలన్నారు. వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు, పాడి పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న రూ. 6 వేలను రూ. 12 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. జీఎం(కొత్త రకం) విత్తనాలతో భూసారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై రీసెర్చ్ చేసి నమ్మదగినదని నిరూపిస్తే తప్ప ఆ విత్తనాలను వాడేదిలేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాల వైఫల్యాలే కారణమన్నారు. రైతులకోసం బీకేఎస్ 40 ఏండ్ల నుంచి పోరాడుతోందని సాయిరెడ్డి చెప్పారు.