ఇలాంటివి నన్ను ప్రభావితం చేయలేవు:లాయర్ దాడి ప్రయత్నంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్

ఇలాంటివి నన్ను ప్రభావితం చేయలేవు:లాయర్ దాడి ప్రయత్నంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్

దిగ్భ్రాంతిపర్చే  ఘటన.. అది దేశ అత్యున్నత న్యాయస్థానంలో..చీఫ్​ జస్టిస్​పైదాడికి యత్నం..ఈ ఘటనతో దేశం మొత్తం అవాక్కయ్యింది. సోమవారం( అక్టోబర్​6) సుప్రీంకోర్టులో చీఫ్​ జస్టిస్​ గవాయ్​పై ఓ లాయర్​ దాడికి యత్నించాడు. ఖజురహోలో విష్ణు విగ్రహంపై సీజేఐ వ్యాఖ్యల తర్వాత దాడి జరిగినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితుడు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డీసీపీ, సుప్రింకోర్టు భద్రతా అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన చీఫ్​ జస్టిస్​ గావాయ్.. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. 

సుప్రీంకోర్టులో ఏం జరిగింది?

సుప్రీంకోర్టు ఆవరణలో సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై ఓ న్యాయవాది బూటు విసిరాడు. నిందితుడిని 71 ఏళ్ల రాకేష్ కిషోర్ గా గుర్తించారు. అదృష్టవశాత్తూ ఆ బూటు CJI వద్దకు చేరలేదు.కోర్టు నంబర్ 1 దగ్గర కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. భద్రతా సిబ్బంది నిందిడిని అదుపులోకి తీసుకున్నారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిందితుడి రాకేష్​ కిషోర్‌ను తీసుకెళ్తున్నప్పుడు అతను సనాతనాన్ని అవమానిస్తే సహించను అని నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో CJI నిర్ఘాంతపోయారు. అయినా విచారణ కొనసాగించారు.  ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు అని సంఘటన తర్వాత CJI చెప్పారు. 

►ALSO READ | బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి : పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

ఖజురహోలోని జవారీ ఆలయంలో విష్ణువు విగ్రహాన్ని పునర్మిర్మాణం విషయంలో వేసిన పిటిషన్​ విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సమయంలో ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో స్మారక చిహ్నాల సమూహంలో భాగం. మొఘల్ దండయాత్రల సమయంలో ఈ విగ్రహం ధ్వంసమైందని, అధికారులు దానిని పునరుద్ధరించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. 

ఖజురహోలో విష్ణు విగ్రహంపై సీజేఐ ఏమన్నారు.. ?

ఖజురహోలోని విష్ణు విగ్రహం పునర్మిర్మాణానికి సంబంధించిన అంశం భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) పరిధిలోకి వస్తుందని కోర్టు తెలిపింది. ఇది పురావస్తు ప్రదేశం..ASI అనుమతి ఇవ్వాలి. ఈ అంశం ASI అధీనంలో ఉంది కాబట్టి.. మీరు విష్ణువుకు గొప్ప భక్తుడని అంటున్నారు. కాబట్టి ఇప్పుడే వెళ్లి ప్రార్థించండి. క్షమించండి" అని CJI  చెప్పినట్లు తెలుస్తోంది. 

సీజీఐ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అయితే తాను అన్ని మతాలను గౌరవిస్తానని..ఎవరి విశ్వాసాలను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని CJI గవాయ్ ఇదివరకే స్పష్టం చేశారు.