- కాంగ్రెస్‌కు ఎంఐఎం బీ టీమ్: ఎంపీ లక్ష్మణ్
- ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నయ్
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి
- మత రాజకీయాలు మజ్లిస్‌కు అలవాటైందని కామెంట్
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. పదేండ్లు బీఆర్ఎస్‌తో అంటకాగిన ఎంఐఎం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ గా మారి రాజకీయాలు చేస్తున్నదని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీజేపీ, ఎంఐఎం మధ్య పోరుగా చూపిస్తున్నారని, మత రాజకీయాలు చేయడం ఎంఐఎం పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో దారుస్సలాం ఆదేశాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపి నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణకు బీజేపీ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మోడల్‌ను రాష్ట్రంలో కూడా అమలు చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ అప్పుల కుప్పగా మార్చాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో కచ్చితంగా మార్పు వస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ యువనేత దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.
