మోదీ మా బ్రహ్మాస్త్రం..ఆయన పేరుతోనే ఎన్నికల బరిలోకి: లక్ష్మణ్

మోదీ మా బ్రహ్మాస్త్రం..ఆయన పేరుతోనే ఎన్నికల బరిలోకి: లక్ష్మణ్
  • రైతుల ఇన్​కం పెంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీయే బీజేపీ బ్రహ్మస్త్రం అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ పేరుతోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్​ గాంధీ ఎందుకు అంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది కనుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నాయన్నారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని, వాళ్లిద్దరి గురువు మజ్లిస్ పార్టీ అని విమర్శించారు. దారుస్సలాం నుంచి వచ్చే ఆదేశాలను.. ప్రగతి భవన్ అమలు చేస్తున్నదని ఆరోపించారు. మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలని రాహుల్ కోరుతున్నారన్నారు. ఎన్నికల ముందుగాని, తర్వాత గానీ బీఆర్ఎస్ కాంగ్రెస్​తో కలవడం ఖాయమన్నారు. మోదీని ఓడించాలంటే ప్రతిపక్ష కూటమిలో బీఆర్ఎస్ చేరక తప్పదని గతంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారన్నారు. పార్లమెంట్‌‌‌‌లో ఖర్గే ఆదేశాలనే బీఆర్ఎస్ పాటించిందని గుర్తు చేశారు. 

పంట ఎమ్మెస్పీ

రబీ పంటల కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతులకు పండుగ కానుక అన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు మోదీ సర్కార్ కృత నిశ్చయంతో ఉందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే ఈ ఎనిమిదేండ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 31 శాతం పెరిగిందని గుర్తు చేశారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై ప్రధానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.