నగర ముఖద్వారమైన ఎల్బీనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. గతేడాది చింతల్ కుంట అండర్స్ ను ప్రారంభించారు. కొన్నినెలల క్రితమే కామినేని వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‍ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం దిల్‍సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. మంత్రివర్గం ఏర్పాటయ్యాక ఓపెన్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
సిటీకి వచ్చే వాళ్లకు ఎల్బీనగర్ కూడలి స్టార్టింగ్ పాయింట్. అలాగే అటు సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లాలన్నా, ఇటు మెహిదీపట్నం, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పోవాలన్నా ఈ చౌరస్తా మీదుగానే వెళ్లాలి. దీంతో నిత్యం సిటీ బస్సులు, ఆంధ్ర వైపు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‍ను తగ్గించేందుకు ఉన్న స్థలంలోనే అండర్స్ లు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు సర్కారు నిర్ణయించింది. ఎడమ వైపు ఫ్లైఓవర్ ఓపెన్ అయితే ట్రాఫిక్ చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంతో రద్డీగా ఉండే ప్రాంతంలో వంతెన నిర్మాణం అంటే అంత ఈజీ కాదు. వివిధ శాఖల సమసన్వయంతో రూ.42 కోట్ల నిధులతో కిలోమీటరు పొడవు,12 మీటర్లు వెడల్పుతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
