
హైదరాబాద్ లో కలకలం రేపిన ప్రేమోన్మాది కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సంఘవికి చికిత్స కొనసాగుతుంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఉన్మాది శివకుమార్ దాడిలో గాయపడి మృతి చెందిన సంఘవి తమ్ముడు చింటు బాడీకి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
నిందితుడు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నేరెళ్లచెరువు గ్రమానికి చెందిన శివకుమార్ గా పోలీసులు గుర్తించారు. మూడేళ్ల క్రితం తన ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకునందుకు శివకుమార్ తండ్రిని సుత్తితో కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తండ్రి హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ప్రేమ పేరుతో సంఘవిని, శివకుమార్ వేధిస్తున్నాడని ఇంట్లో గొడవకు దిగారు. వారిద్దరు పదవ తరగతి వరకు కలసి చదువుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు శివకుమార్ నేర చరిత్రపై పోలీసులు విచారిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
హైదరాబాద్ ఎల్ బీనగర్ లో ఆగస్టు 3న ఓ ప్రేమోన్మాది పెళ్లికి నిరాకరిస్తోందనే కారణంతో ప్రియురాలు, ఆమె తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తమ్ముడు పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, సంఘవి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
నగరంలోని ఎల్ బీనగర్ ప్రాంతంలో సంఘవి, ఆమె సోదరుడు పృథ్వీ నివసిస్తున్నారు. ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వారిపై దాడికి పాల్పడ్డాడు. అతను సంఘవి ప్రియుడని, పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్ కి తరలించారు. కొంతకాలంగా శివకుమార్, సంఘవి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి గురించి మాట్లాడేందుకు వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన శివకుమార్ వెంట తీసుకువచ్చిన కత్తితో దాడికి పాల్పడ్డాడు. పృథ్వి వారిని ఆపడానికి ప్రయత్నించగా ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు.