ఆపరేషన్ కగార్ ఆపండి : ప్రజాసంఘాల నేతలు

ఆపరేషన్ కగార్ ఆపండి : ప్రజాసంఘాల నేతలు
  •      కేంద్రానికి లెఫ్ట్‌‌‌‌ పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌‌‌‌
  •     జన జీవనంలోకి రావాలని మావోయిస్టులకూ పిలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌–-2ను వెంటనే ఆపేసి, మావోయిస్టులు గౌరవప్రదంగా జనజీవనంలోకి వచ్చేలా వాతావరణం కల్పించాలని లెఫ్ట్‌‌‌‌ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మారుతున్న పరిస్థితులలో మావోయిస్టులు కూడా సాయుధ పోరాట పంథానే వీడి.. ప్రజాస్వామ్య పద్ధతుల్లోకి రావాలని కోరారు. వచ్చే మార్చికల్లా మావోయిస్టులను లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందని, సొంత పౌరులపై చేస్తున్న ఈ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని మగ్ధూంభవన్‌‌‌‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌ నిలిపివేత- మావోయిస్టుల జనజీవన స్రవంతి’ అనే అంశంపై సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌‌‌‌లో టీజేఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌‌‌‌), పౌరహక్కుల నేతలు పాల్గొని మాట్లాడారు.

ఉద్యమ తీరు మారాలి: కూనంనేని

కమ్యూనిస్టులు కాలానుగుణంగా ఉద్యమ పంథాను మార్చుకోవాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. నేటి పరిస్థితుల్లో సాయుధ పోరాటం సాధ్యం కాదని, తుపాకుల ద్వారా కాకుండా నేపాల్‌‌‌‌ తరహాలో ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా విప్లవం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. టెర్రరిస్టులపై చూపని ప్రతాపం సొంత దేశ పౌరులపై ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రజా పక్షాన నిలిచి పనిచేస్తున్న మావోయిస్టులను శత్రువులుగా చూడటం సరికాదని అన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలతో ఏకీభవించకపోయినా.. వారి పట్ల కేంద్రం విద్వేషంతో వ్యవహరించడం సరికాదన్నారు. 

చట్ట ప్రకారం లొంగదీసుకునేందుకు ఎంత బలప్రయోగం అవసరమో అంతే వాడాలని, అంతకుమించి చేయడం చట్ట విరుద్ధమని కోదండరాం స్పష్టం చేశారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే కేంద్రం ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌ పేరుతో నరమేధం సృష్టిస్తోందని పలువురు నేతలు ధ్వజమెత్తారు. అర్బన్‌‌‌‌ నక్సలైట్ల పేరుతో వరవరరావు వంటి వారిపై బనాయించిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు.