హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకున్నదని, అందుకే ఇతర పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి పీసీసీ చీఫ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు.
రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతుందని తెలిపారు.
